ఏపీలో కరెంట్ షాక్.. ట్రూ అప్ ఛార్జ్ అంటే ఏంటి?

ఏపిలో ప్రజలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇవ్వనుందా.. అంటే అవుననే అంటున్నారు. వచ్చే నెల నుంచి ఏపీలో పవర్ బిల్స్ లో ట్రూ అప్ పవర్ ఛార్జ్ కొత్తగా యాడ్ చేశారు. ఇప్పటికే ఆస్తి, చెత్త పన్నులు, రోడ్ ట్యాక్స్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు తాజాగా జగన్ సర్కార్ కరెంట్ చార్జీలు పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు ఏపి ఈఆర్సీ ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం. వచ్చే నెల కరెంట్ బిల్లులు చూస్తే వినియోగదారులకు దిమ్మతిరిగే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. సీఎంగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత కరెంట్ బిల్లులు పెంచబోమని తెలిపిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కరెంట్ చార్జీల బాదుడు మొదలు పెట్టారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

current bills compressedఏపిలో ప్రస్తుతం ఉన్న కరెంటు బిల్లుల్లో మోత మోగించేందుకు సర్కార్ సిద్దమవుతుంది. వచ్చే నెల నుంచి వరుసగా 8 నెలల పాటు ట్రూ ఆప్ సర్ధుబాటు చార్జీల భారం వేయనుంది. ఇప్పటి వరకు తాము వాడుతున్న బిల్లలు మొత్తాన్ని చెల్లించే వినియోగదారులు ఇకపై తాము వాడనటువంటి మొత్తాన్ని అదనపు ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో సరైన ఉద్యోగాలు లేక.. ఉపాధి లేక కష్టాలు పడుతుంటే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఏంటిరా బాబో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రూ అప్ ఛార్జ్ అంటే ఏంటి?
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అంటే ఆ ఐదేళ్ల పాటు విద్యుత్ ఉత్పాదనకు అయిన ఖర్చు.. సరఫరాకు అయిన ఖర్చు కు మద్య ఉండే వ్యత్యాసాన్ని నష్టాల రూపంలో ప్రజలపై రుద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీనికి పెట్టిన పేరే ట్రూ అఫ్ ఛార్జి. అప్పడు తలెత్తిన నష్టాలను ఇప్పుడు వాడకం ఆధారంగా వినియోగదారుల నుంచి సర్ధుబాటు చేస్తారన్నమాట. దీంతో పాత నష్టాలకు కొత్త చార్జీల వడ్డనకు డిస్కంలు సిద్దం చేస్తున్నాయి. గతంలో నష్టాన్ని 10 శాతానికి పైగా వడ్డితో కలిపి డిస్కంలు వినియోగదారులకు వడ్డించబోతున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్ కి రూ.1.27, ఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్ కి రూ.0.45 చొప్పున అదనపు చార్జీలు వసూళ్లు చేయబోతున్నారు. ఎన్నికల సమయంలో కరెంట్ చార్జీలు పెంచబోనని సీఎం జగన్ హామీ ఇచ్చి.. ఇప్పుడు మాత్రం చార్జీలు పెంచి వినియోగదారుల నడ్డి విరుస్తున్నారని సామాన్య ప్రజలు.. ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు.