కన్నవాళ్లు కాదనుకుని చెత్త కుప్పలో పడేసిన చిన్నారి.. ఇప్పుడు అమెరికాకు

గుజరాత్- మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలోను ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మన దేశంలో ఇంకా ఆడ పిల్ల పుట్టిందంటే చాలు అదేదో ఘోరం జరిగిపోయిందని చాలా మంది బాధ పడిపోతున్నారు. ఆడపిల్లగా పుట్టడం చాలా చోట్ల నేరమైతే.. మరి కొన్ని చోట్ల పుట్టీ పుట్టగానే పసికందును చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు జరుగుతూనే ఉన్నాయి.

గుజరాత్ లోను సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. గాంధీనగర్ లో నాలుగు సంవత్సరాల కింద చెత్త కుప్పంలో ఓ పసికందు ఏడుస్తూ కనిపించింది. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి పసికందును ఆస్పత్రికి తరలించారు. పాపం ఎవరు కని పడేశారో తెలియదు కానీ తెల్లార్లు ఏడుస్తూనే ఉందట. కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత బతికి బట్ట కట్టింది.

joy

ఆ పాపను తీసుకెళ్లేందుకు ఎవరు రాకపోవడంతో ఆస్పత్రి నుంచి అహ్మదాబాద్ లోని చిల్డ్రన్ హోంకు తరలించారు. ఇదిగో నాలుగేళ్లుగా ఆ పాప చిల్డ్రన్ హోంలోనే పెరిగింది. కన్నవాళ్లు కాదనుకున్నా ఆ చిన్నారిని ఇన్ని రోజుల తరువాత దేశం కాని దేశం వాళ్లు దత్త తీసుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఇన్నాళ్లు అనాధగా పెరిగిన ఆ చిన్నారి ఇప్పుడు భారత్ నుంచి ఏకంగా అమెరికా వెళ్లబోతోంది.

ఆ చిన్నారి పేరు అర్పిత. ఇటీవల చిల్డ్రన్ హోం నిర్వాహకులు అర్పిత పేరును ఆన్‌ లైన్ దత్తత కార్యక్రమంలో నమోదు చేశారు. దాంతో అమెరికాలోని నాథన్, థాంమ్సన్ దంపతులు అర్పితను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇటీవల చిల్డ్రన్ హోంకు వచ్చిన నాథన్ దంపతులు అర్పితను కలిశారు. ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు వారు సమ్మతం తెలిపారు. అర్పిత పేరును జాయ్‌గా మార్చారు నాథన్.

అధికారికంగా దత్తత ప్రక్రియ పూర్తికాగానే తనతో పాటు జాయ్ ను అమెరికా తీసుకెళ్తానంటూ నాథన్ చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ సాంగ్లె సైతం అర్పిత ఉంటున్న చిల్డ్రన్ హోంను సందర్శించారు. ఈ సందర్భంగా అర్పిత దత్తత విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దత్తత ప్రక్రియ పూర్తికాగానే అర్పితను అమెరికాకు పంపాల్సిందిగా నిర్వాహకులతో చెప్పారు జిల్లా కలెక్టర్. విధి రాత అంటే ఇదే మరి. కన్న వాళ్లు కాదనుకున్నా.. ఏకంగా అమెరికా వెళ్తోంది ఆ చిన్నారి.