చదువు కోసం దాచుకున్న రూ.25 లక్షలు.. కళ్ల ముందే అగ్నికి ఆహుతి

25lakhs burned

కొడుకు బాగా చదివి గొప్ప స్థాయిలో ఉండాలని ఆ తల్లి కలలు కంది. కేవలం కలలకే పరిమితం కాకుండా అందుకు అవసరమైన డబ్బు కోసం తీవ్రంగా కష్టపడింది. అలా వచ్చిన డబ్బును దాచుకుంటూ వచ్చింది. ఇంతలో వారి కలలపై అగ్నిప్రమాదం రూపంలో దురదృష్టం నీళ్లు చల్లింది. ఆ ప్రమాదంలో ఇంటితో పాటు కొడుకు చదువు కోసం ఆ పేద తల్లి దాచుకున్న అక్షరాల 25 లక్షల రూపాయలు కాలిబూడిదయ్యాయి. ఇన్ని రోజుల తమ కష్టం ఇలా మంట్లో ఆహుతి అవ్వడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అయ్యే పాపం అనిపించే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని గురుభట్లగూడెంలో చోటు చేసుకుంది.

కాళ్ల క్రిష్ణవేణి తన కుమారిడితో కలిసి ఆ గ్రామంలో నివాసముంటుంది. ఈ క్రమంలో ఒక రోజు వాళ్ల ఇంటి పక్కన ఉన్న గడ్డివాముకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడి అవికాస్తా క్రిష్ణవేణి ఇంటికి వ్యాపించాయి. తాటాకులతో కట్టుకున్న ఇంటిని మంటలు వేగంగా వ్యాపించాయి. ఎలాగోలా ప్రాణాలతో తల్లికొడుకులు బయటపడ్డారు గానీ, వాళ్ల కలలు మాత్రం కాలిబూడిదయ్యాయి. అన్ని 500 నోట్ల కట్టలు మొత్తం రూ.25 లక్షలు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడ్డా ఎంతో కష్టపడి దాచుకున్నడబ్బు సర్వాన్ని కోల్పోయిన ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటుంటే అక్కడ ఉన్న వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి.