రక్తదానంలో మహిళలూ ముందుంటున్నారు : ఐపీఎస్ ఆఫీసర్ ఎన్.శ్వేత

ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడామన్న సంతోషం కలుగుతోంది. సాధారణంగా చాలామంది మహిళల్లో రక్తహీనత అనేది ఒక సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అంటే గొప్ప విషయంగానే భావించాలి. కామారెడ్డి జిల్లాలో రక్తదానం ఒక ఉద్యమంగా సాగుతున్న సందర్భంలో రక్తదానం చేస్తూ పలువురు మహిళలు కూడా రక్తదాతలుగా వెలుగొందుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు గడచింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్.శ్వేత ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు. ఏటా రెండుసార్లు రక్తం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నానని, ఇది నిరాటంకం గా కొనసాగిస్తానంటున్నారు. Can Covid 19 survivors donate blood What are the risks involved 750x500 1

ఎస్పీ స్ఫూర్తితో పలువురు యువతులు మేము కూడా అంటూ ముందుకు వస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు రక్తదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఒకరి రక్తదానంతో మరొకరి ప్రాణం కాపాడొచ్చని చెబుతున్నారు. మహిళలు రక్తదానం విషయంలో ఉన్న అపోహలు వీడాల్సిన అవసరం ఉంది. మగవారే కాదు మగువలూ రక్తం ఇవ్వొచ్చు. రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మహిళలకు రక్తదాన విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి.