జగన్ బెయిల్ రద్దు పిటీషనే రఘురామ కొంప ముంచిందా

jagan bail

అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులేంటి.. సొంత పార్టీ ఎంపీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు అరెస్టే చేయించారు.. అసలు జగన్ కు, రఘురామ కృష్ణరాజుకు మద్య ఉన్న విభేదాలేంటి.. అరెస్ట్ వరకు దారితీసిన పరిస్థితులేంటి.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మదిలో మెదులుతున్నాయి. పార్టీ టిక్కెట్ ఇచ్చి, ఎంపీగా గెలిపించిన జగనే.. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చిందంటే.. అందుకు ఒక్కటే సమాధానం వస్తోంది.. అదే జగన్ బెయిల్ రద్దు పిటీషన్. అవును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది కూడా. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ 11 చార్జ్ షీట్లను నమోదు చేసిందని ఎంపీ రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతి చార్జ్‌ షీట్‌లో జగన్ ఏ-1 ముద్దాయిగా ఉన్నారని తెలిపాడు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు స్పష్టం చేశారు రఘురామ కృష్ణరాజు.

jagan vs raghurama krishnaraju

అంతే కాదు సీఎం జగన్‌పై నమోదైన కేసులను వేగవంతంగా విచారణ జరపాలని కూడా రఘురామ కృష్ణరాజు తన పిటీషన్‌లో కోర్టును కోరారు. ముఖ్యమంత్రి జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ పేర్కొనడం కొసమెరుపు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ ఎంపీగా తనపై ఉందని పిటీషన్ లో తెలిపారు. ఇక రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఈనెల 17న విచారణ జరగనుంది. దీంతో ఈ కేసుపై సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐతే తన సొంత పార్టీ ఎంపీ తన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటీషన్ వేయడాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది. ఈ కేసులో ఏదైనా తేడా జరిగితే తన ముఖ్యమంత్రి పదవికే ఎసరు వస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అందుకే ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారన్న వాదన వినిపిస్తోంది.