తెలుగులో తేలిపోతున్న బాలీవుడ్ కంపోజర్స్!

Amit Trivedi

తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన పలు సంగీత దర్శకులు తెలుగులో సత్తా చాటినట్టే.. అప్పుడప్పుడూ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ కూడా టాలీవుడ్ లో మెప్పించిన దాఖలాలున్నాయి. ‘మజ్ను’ సినిమాతో లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, ‘అంతం’ చిత్రంతో ఆర్.డి. బర్మన్, ‘గ్యాంగ్ లీడర్’తో బప్పిలహరి, ‘నిన్నే పెళ్లాడతా’, ‘సూపర్’ వంటి చిత్రాలతో సందీప్ చౌతా వంటి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. తెలుగులో అడపాదడపా తమ సంగీతంతో అలరించారు. ఇక ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరంతన్ భట్ కూడా సూపర్భ్ అనిపించుకున్నాడు. ఇక ‘చింతకాయల రవి’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన బాలీవుడ్ మ్యూజికల్ డ్యూయో విశాల్-శేఖర్.. ఆ తర్వాత చాన్నాళ్లకు ‘నా పేరు సూర్య’కి సంగీతాన్నందించారు. అయితే.. వీరంతా టాలీవుడ్ లో సక్సెస్ అయినా.., మళ్ళీ బాలీవుడ్ కి బ్యాక్ అయిపోయారు.

Shankar–Ehsaan–Loy‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ మ్యూజికల్ ట్రయో శంకర్-ఇషాన్-లాయ్ మళ్లీ ‘సాహో’ సినిమాకి సంగీతాన్నందించే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే.. ‘సాహో’ మేకర్స్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వలన.. ఆ తర్వాత ప్రభాస్ సినిమా నుంచి తప్పుకున్నారు శంకర్-ఇషాన్-లాయ్. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన హిస్టారికల్ డ్రామా ‘సైర’ సినిమాకి ఏరికోరి బాలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అమిత్ త్రివేదిని ఎంపిక చేసుకున్నాడు. అయితే.. ‘సైరా’ సాంగ్స్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకుల్ని సైతం మెప్పించలేకపోయాయి. ఇక.. నాని ‘వి’ సినిమాకి కూడా అమిత్ మ్యూజిక్ అంతగా ప్లస్ కాలేదు.

ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయకుల చిత్రాలకు దేవిశ్రీప్రసాద్, తమన్, మణిశర్మ మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తున్నారు. ఇక.. మీడియం రేంజ్ హీరోల చిత్రాలకు మిక్కీ జె మేయర్, అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తుంటే.. మిగిలిన గ్యాప్ అంతా మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్, తమిళ సంగీత దర్శకులు అనిరుద్, జి.వి.ప్రకాశ్, విశాల్ చంద్రశేఖర్ వంటి వారు ఫిల్ చేస్తున్నారు. తెలుగులో సంగీత దర్శకులకు ఫుల్ డిమాండ్ ఉన్నా.. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ ఇక్కడ అంతగా రాణించలేకపోవడానికి కారణం.. ఒకటి నేటివిటీ ప్రోబ్లమ్ అయితే.., రెండోది క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఒక తరహా సంగీతానికి అలవాటు పడ్డ ఈ మ్యూజిక్ కంపోజర్స్.. మన మాస్ హీరోల పల్స్ పట్టుకునే ప్రయత్నంలో విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.