మామకి కరోనా! భుజాలపై మోసిన కోడలు!

కరోనా.. ఈ మూడు అక్షరాలు ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తున్నాయి. ఈ మహమ్మరి దెబ్బకి బంధాలు కూడా బీటలు వారుతున్నాయి. కరోనా సోకిందని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు,కూతుళ్లు చాలా మందే ఉన్నారు. కరోనా కారణంగా చనిపోయిన కూతురి చివరిచూపుకి హాజరుకాని తల్లిదండ్రులు ఉన్నారు. ఈ చైనా వైరస్ దెబ్బకి రక్త సంబంధాలు సైతం ఇలా పలచన అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఓ మహిళ చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మానవత్వంతో ఆమె చేసిన సేవకు ఇపుడు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.., అసోంలో నాగావ్ రాహ జిల్లాకు చెందిన నిహారికా దాస్ ఓ సామాన్య మధ్య తరగతి గృహిణి. ఆమె మామ తులేశ్వర్ దాస్ కరోనాకి గురి అయ్యాడు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అతనిలో కరోనా లక్షణాలు బయట పడటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన నివాస ప్రాంతం వరకు వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తన మామని భుజాలపైనే మోసుకెళ్లింది కోడలు నిహారిక.

a woman power today (Covid Issue)తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన మామకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఆయన్ను 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో.., అంత బరువున్న వ్యక్తిని మళ్లీ భుజాలపైనే ఎత్తుకుని వాహనం ఉన్న ప్రదేశం వరకు వచ్చింది ఆ కోడలు. అందరూ నిహారిక కష్టాన్ని చూస్తూ ఉండిపోయారు తప్ప.., ఎవరూ సహాయం చేయడానికి ముందుకి రాలేదు. ఇక నాగావ్ అసుపత్రికి తీసుకువెళ్లాక, అక్కడ స్ట్రెచర్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో మళ్లీ తనే భుజాల మీద తన మామను ఎత్తుకుని ఆసుపత్రిలోకి తీసుకువెళ్లింది నిహారిక. తరువాత చేసిన పరీక్షల్లో నిహారికకూ కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ హాస్పిటల్ లో కోలుకుంటోంది. కాగా.., తన మామను నిహారిక తన భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్గా మారాయి. నిహారిక చేసిన సాహసం అద్వితీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. దీంతో.., నిహారికని మోడల్ ఆఫ్ డాటర్ ఇన్ లా’ గా అంతా కీర్తిస్తున్నారు. కానీ.., కరోనా సోకిన తన మామను ఆస్పత్రికి తరలించేందుకు నిహారిక ఇంత కష్టపడాల్సి రావడం అసోంలోని వైద్య వ్యవస్థ తీరుని కళ్ళకి కట్టినట్టు అయ్యింది. మరి.., మహమ్మారికి జంకకుండా మావయ్యని బతికించుకున్న నిహారిక ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.