పెళ్లంటే ఇద్దరు మనుషులకు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలకు కూడా మరుపురాని కార్యక్రమం. అందుకే పెళ్లిని ఎప్పుడూ గుర్తుండిపోయేలా అద్భుతంగా చేయ్యాలని చూస్తుంటారు. ఎవరికి వారు తమ తాహతకు తగినట్లు పెళ్లిళ్లు చేస్తుంటారు. డబ్బున్న వారు తమ హోదాకు తగ్గట్టు రిచ్‌గా.. పెళ్లిని అంగరంగ వైభవంగా తమ హోదా అందులో ఉట్టిపడేలా చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి పెళ్లి వెరైటీగా, పెళ్లిలో డబ్బు కల ఉట్టిపడేలా జరిగింది. అందరిలా కాకుండా పెళ్లి దండను డబ్బులతో తయారు చేసి మెడలో వేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి పెళ్లి తాజాగా జరిగింది. కుటుంబసభ్యులు పెళ్లి కొడుకు మెడలో వేయాల్సిన దండను డబ్బులతో తయారు చేయించారు. ఏకంగా లక్షల డబ్బు ఖర్చుపెట్టి పెళ్లి దండను తయారు చేయించారు.
ఆ దండ చాలా భారీగా ఉంది. పెళ్లి కొడుకు దాన్ని మెడలో వేసుకుని పట్టుకోలేకపోయాడు. ఓ ఆరుగురు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. పెళ్లి కూతురితో పాటు స్నేహితులు కలిసి దాన్ని చేత్తో పట్టుకుని నిలబడ్డారు. ఆ పెళ్లి దండ ఐదు అడుగుల వెడల్పు.. పది అడుగుల పొడవుతో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో 4 లక్షలకు పైగా వ్యూస్, 3,47,000 లైక్స్‌ను సంపాదించింది. ఈ సంఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ పెళ్లంటే ఇలా ఉండాలి. నువ్వు సూపర్ బ్రో’’.. ‘‘ ఇలాంటి దండలు మన పెళ్లిళ్లకు ఎందుకు వేయలేదు?’’.. ‘‘ అదో బెడ్ కవర్లా ఉంది’’.. ‘‘ ఆ పెళ్లి కొడుకును బకరా చేయటానికే అలా చేస్తున్నారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.