వారిది అన్యోన్య దాంపత్యం.. ఆర్థికంగా బాగానే స్థిర పడ్డారు. సంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది. దంపతులిద్దర్నీ క్షణాల్లో మృత్యుఒడికి చేర్చింది.
వారిది ఎంతో అన్యోన్యంగా సాగుతున్న సంసారం. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. వారికి రామలక్ష్మణ లాంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని బాగా చదివించి ఓ ఉన్నతస్థితిలో చూడాలనేది ఆ దంపతుల కోరిక. అలా సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబాన్ని విద్యుత్తు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. కరెంట్ షాక్ తో ఆ దంపతులిద్దరు క్షణాల వ్యవధిలో మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలో బొల్లంపల్లి శ్రీనివాస్(44), శశిదేవి అలియాస్ జయశ్రీ(38) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లంపల్లి శ్రీనివాస్.. చెన్నూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నారు. వీరికి చరణ్ రాజ్, పవన్ తేజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు ఇంటర్ చదువుతుండగా, చిన్న కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. గత రెండుమూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇలానే గురువారం రాత్రి కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
దీంతో జయశ్రీ వాళ్ల ఇంటి ఆవరణంలో చెత్త పేరుకపోయింది. శుక్రవారం ఉదయం లేచిన జయశ్రీ ఆ చెత్తను శుభ్రం చేశారు. అలానే తీగపై ఆరేసిన బట్టలు గాలికి కిందపడటానికి గమనించిన ఆమె.. వాటిని తిరిగి అదే తీగపై వేసే ప్రయత్నం చేశారు. ఆ తీగకు కరెంట్ సరఫరా జరగడంతో కిందపడి పడిపోయారు. ఆ అలికిడి ఇంట్లో ఉన్న ఆమె భర్త పరుగున భయటకు వచ్చి.. కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనకు కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో క్షణాల వ్యవధిలో దంపతులిద్దరు మృతి చెందారు. ఇంటి ఆవరణలోకి వెలుగు వచ్చేందుకు వీలుగా ప్రధాన గేటు వద్ద గోడకు లైట్ ను ఏర్పాటు చేసి ఉంది.
లైట్ ఉన్న గొట్టానికి, మరోవైపు ఉన్న కమ్మీకి మధ్య తీగ కట్టుకుని దుస్తులు ఆరేసుకునే ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి విద్యుద్దీపం ద్వారా ఆ పైపుకు, దాని నుంచి తీగకు కరెంట్ ప్రసారమైంది. ఈ విషయం తెలియని జయశ్రీ రోజు మాదిరిగానే దుస్తులు ఆరేస్తూ తీగకు చెయ్యి తగిలి కరెంట్ షాక్ కి గురైంది. అదే సమయంలో ఆమెను కాపాడాలనే తాపత్రయంలో భర్త ప్రమాదంలో పడ్డారు. దీంతో ఇద్దరు కరెంట్ కారణంగా మృత్యుఒడిలో ఒరిగిపోయారు. మరి.. ఈ ఇలాంటి ప్రమాదాల నుంచి బయట పడేందుకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.