ఈ ఆరేడేళ్లలో తెలంగాణలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందింది. దీనికి ఊతమిస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భూతల్లి పచ్చచీర కట్టుకుందా అనేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి..
ఒకప్పుడు తెలుగు నాట పచ్చదనం అంటే కోనసీమ లేదా ఉభయ గోదావరి జిల్లాల గురించే చెప్పుకునే వారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ఎటు చూసిన పంటపొలాలు, చెట్లతో చూసేందుకు కన్నులవిందుగా ఉండేది. అందుకే సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువగా అక్కడే జరిగేవి. గోదావరి నేపథ్యంలో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఇక, సీమాంధ్రలో పరిస్థితి అలా ఉంటే తెలంగాణలో మాత్రం మరోలా ఉండేది. ఎక్కడ చూసినా నీళ్లు లేక బోసిపోయిన బీడుభూములు దర్శనమిచ్చేవి. నీళ్ల సదుపాయం లేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణ ఎవరికీ తీసిపోని స్థాయిలో రాణిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం రంగంలో పరుగులు పెడుతోంది. గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులు, చెరువులు, సరస్సులపై ఆధారపడి ఇక్కడ సాగు సాఫీగా సాగిపోతోంది. శ్రీరాంసాంగర్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల వల్ల నీటికి ఢోకా లేకుండా పోయింది. అదే సమయంలో గత ఆరేడేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలు నిండి పంటపొలాలకు నీరు అందుతోంది. వ్యవసాయానికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలతో తెలంగాణ పాడిపంటలతో కళకళలాడుతోంది.
కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తోంది. అందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో తీసినట్లుగా చెబుతున్న ఈ వీడియోలో సుదూరాల వరకు పంటపొలాలతో భూమి పచ్చటి చీర కట్టుకున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ పొలాల మధ్య రోడ్డుపై భారీ కాన్వాయ్ వెళ్తుండటాన్ని అందులో చూడొచ్చు. ఈ కాన్వాయ్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌గా చెబుతున్నారు. ఇది సీమాంధ్ర కాదు.. తెలంగాణ అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి.. ఈ వీడియో చూశాక మీకు ఏం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
సీమాంధ్ర కాదండీ
మాది తెలంగాణ @KTRBRS @puvvada_ajay @HiHyderabad pic.twitter.com/tnKKl61yPN— YASIN YASIN (@itsmeeYasin) March 9, 2023