భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి తెలంగాణలోని పలు గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. ఈ వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందగా 14 మంది గల్లంతయ్యారు. రెండు వేలకు పైగా ఇళ్ళు దెబ్బతినగా.. 5.5 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 135 చెరువులకు గండ్లు పడడంతో గట్లు తెగిపోయాయి. హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట, హనుమకొండ సహా పలు పట్టణాలు, నగరాల్లోని కాలనీలు, పలు జిల్లాల్లోని గ్రామాలు నీట మునిగాయి. నడుము లోతు నీళ్లలో నడుస్తూ స్థానికులు బయటపడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తడంతో సుమారు 60 ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలను నిలివేశారు.
హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి మార్గంలో కొన్ని చోట్ల వరద ప్రవహించడంతో వాహనాలను దారి మళ్లించారు. బస్సులను నిలిపివేశారు. కొన్ని చోట్ల రైల్వేస్టేషన్లలోకి, పట్టాల మీద నీరు చేరడంతో ఐదు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. పంటపొలాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనలు దెబ్బ తినడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి జిల్లా మున్నేరు వాగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని సైనిక హెలికాప్టర్ల సాయంతో రక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వరద ప్రవాహంలో 14 మంది గల్లంతయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది గల్లంతయ్యారు. ఇద్దరు మృతి చెందారు.
నిజామాబాద్ లో ఇద్దరు, మెదక్ లో ఇద్దరు, మహబూబ్ నగర్ లో ఒకరు, ఖమ్మంలో ఒకరు మొత్తం ఆరుగురు కొట్టుకుపోయారు. మెదక్ లో వరద ప్రవాహంలో గల్లంతైన ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఖమ్మంలోని వరదల్లో చిక్కుకున్న 11 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మున్నేరు నది పరివాహక ప్రాంతాలైన గణేష్ నగర్, పద్మావతి నగర్ సహా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 100 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్-హనుమకొండ మధ్య రాకపోకలు లేవు. వరంగల్-ములుగు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉప్పొంగడంతో బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం, గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామాలకు బయటి ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి.