సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) దశ తిరిగింది. ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.. నుంచి.. నేడు లాభాల బాటలో ప్రయణించే దిశకు చేరుకుంది. నేడు టీఎస్‌ఆర్టీసీ.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది అంటే.. సజ్జనార్ కృషి వల్ల అని చెప్పవచ్చు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. ప్రయాణికులను ఆకర్షించడం కోసం రకరకాల కార్యక్రమాలు.. వినూత్న ఆఫర్‌లు ప్రకటించాడు. ఆయన తీసుకున్న చర్యలు.. నేడు ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ కష్టాల నుండి గట్టెక్కి అభివృద్ది బాట పట్టేందుకు వేగంగా అడుగులేస్తోంది. దానిలో భాగంగానే ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ.. యాభైకిపైగా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం.. మరో కొత్తరకం స్లీపర్ బస్సులను రోడ్డెక్కించనుంది టీఎస్‌ఆర్టీసీ. ప్రయాణీకుల సౌకర్యంతో పాటు.. వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రంలో తొలిసారిగా టీఎస్‌ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రారంభించబోతుంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు నేటి నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను నడిపేందుకు.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం రెడీ అయ్యింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ వద్ద ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సంస్థ చైర్మన్, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే, ఎండీ వీసీ సజ్జనార్, అడిషనల్ డీజీపీ ఈ కొత్త బస్సులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వెంటనే ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దాంతో బస్సుల కొరత ఏర్పడటమే కాక డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నేడు ప్రారంభించనున్న ఈ సూపర్ లగ్జరీ, స్లీపర్ బస్సులు ప్రయాణికులు కష్టాలు తీర్చడంతోపాటు టీఎస్‌ఆర్టీసీకి ఆదాయం అందజేస్తాయి.
స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయం, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. ఇక సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్‌లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేశారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రయాణికుల సౌకర్యరార్ధం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కల్పించారు. అంతేకాక ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్ రోడ్ వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం, బస్సు లోపలి ప్రాంతంలో ఈ కెమెరాలుంటాయి. ప్రయాణికులకు భద్రత కల్పించడమే కాక.. సురక్షితంగా డ్రైవ్ చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి సజ్జనార్ తీసుకుంటున్న చర్యల వల్ల.. ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.