హైదరాబాద్ వాసులకు సాధారణంగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు. అలాంటిది ప్రత్యేక సందర్భాలు, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఇక గురువారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..
సాధారణంగానే భాగ్యనగరంలో.. ఉదయం ఎనిమిది దాటితే.. ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతాయి. ఇక నగరంలో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు వంటివి ఉంటే.. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఆ విషయం తెలుసుకోకుండా మనం రోడ్డు ఎక్కామా.. ఇక అంతే. గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కారణం హనుమాన్ జయంతి. ఈ నేపథ్యంలో హన్‌మాన్ శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తెలిపారు. రేపు (గురవారం) ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిర్‌లో శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర ప్రారంభమయ్యి.. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు చేరుకుంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఈ క్రమంలో శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలైన రామ్‌మందిర్, పుత్లిబౌలి క్రాస్‌రోడ్స్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్‌రోడ్స్, కోఠి – డీఎంహెచ్‌ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్‌రోడ్, రామ్‌కోఠి క్రాస్‌రోడ్స్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీలైట్ హోటల్, బాటా షోరూం, ఉజ్జయిని మహంకాళి ఆలయం, ఓల్డ్ రాంగోపాల్‌పేట్ ఠాణా, ప్యారడైజ్ క్రాస్‌రోడ్, సీటీపీ జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ వరకు.. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
అంతేకాక హన్‌మాన్ శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల వారీగా ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ రూట్లలో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీనికి సంబంధించి ఏవైనా సమాచారం, సాయం కావాలంటే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 90102 03626, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ 040 2785 2482 నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. మరోవైపు హన్‌మాన్ జయంతి సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టమన్నారు పోలీసులు. సున్నితమైన ప్రాంతాలను గుర్తించి భద్రతను పెంచామని వివరించారు. హన్‌మాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లను ఒకరోజు పాటు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరి మీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని.. ప్రయాణాలు ఏర్పాటు చేసుకొండి.