అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పళ్లు ఊడతాయి అని పెద్దలు చెప్పే సామెత. వాళ్లు ఊరికే అని ఉండకపోవచ్చు కాబోలు. కొన్ని కొన్ని ఘటనలు జరిగిన తీరు, పెద్దల అనుభవంతో ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఇలా చిన్న విషయాన్ని పళ్లు కాదు కదా.. ప్రాణాలు కూడపోయిన సందర్భాలు ఉన్నాయి. చికెన్ తింటూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, పండ్లు తింటూ చనిపోయిన వ్యక్తి.. మనం తరచూ ఇటువంటి వార్తలు వింటూ ఉంటాము. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఎగ్ ఆమ్లెట్ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. మరి.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి(38) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో నవంబర్ 3న మద్యం సేవించేందుకు స్థానికంగా ఉన్న వైన్ షాపుకి వెళ్లారు. అక్కడ ఓ రూమ్ లో కూర్చుని మద్యం సేవిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఎగ్ ఆమ్లెట్ ఆర్డర్ కూడా ఇచ్చాడు. అలా మద్యం తాగుతూ.. ఆమ్లెట్ తింటున్నాడు. అది చల్లగా అయిపోతుందనే ఆతృతలో కొంచెం త్వరగా తింటున్నాడు. ఈక్రమంలో ఆ ఆమ్లెట్ ముక్క ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస అందక భూపాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతం అయ్యారు.
చూశారా.. ‘ఆలస్యం అమృతం విషం’ అనే మాటతో పాటు ‘నిదానమే ప్రధానం’ అనే మాటను కూడా గుర్తుంచుకోవాలి.. లేకుంటా ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటాయి. భూపాల్ రెడ్డి తొందర పాటు కారణంగా ఆయన భార్య, పిల్లలు దిక్కులేనివారు అయ్యారు. ఒక్క ఎగ్ ఆమ్లెట్ అనే కాదు.. ఏం పదార్ధం తింటున్నా కూడా కాస్త నెమ్మదిగా తినండి. ఉరుకులు, పరుగుల లైఫ్ లో తిండి తినడానికి కూడా సమయం లేకుండా పోయింది. ప్రయాణ సమయంలో ఉన్నప్పుడు కూడా హడవుడిగా తినేస్తున్నారు కొందరు. అలాంటి సమయాల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏం చేసినా మంచి తిండి, మంచి నిద్ర కోసమే అనేది మర్చిపోవద్దు.