మూడు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు విధి ఆడిన వింత నాటకంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ వధువు.. విగతజీవిగా పడి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
జీవితంలో ఊహించని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉండే ఆ కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మూడు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంది. వివాహం సన్నాహక పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి వధువు మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్లకు చెందిన తంగలపల్లి నర్సయ్య, రాధ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆ దంపతులు రేయింబవళ్లు కష్టపడి ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. అలానే పెద్ద కుమార్తెకు కొన్నిఏళ్ల క్రితం వివాహం చేశారు. రెండో కుమార్తె స్వరూపరాణి(24) డిగ్రీ, బీఎడ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. చిన్నకుమార్తె వివాహం ఈ నెల 12 జరపాలని నర్సయ్య కుటుంబ సభ్యులు నిశ్చయించారు.
ఈ క్రమంలో వేములవాడకు కాబోయే వధువులు వెళ్లి మొక్కు చెల్లించాలని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో మొక్కులు చెల్లించుకునేందుకు స్వరూపరాణి.. తన అక్క కుమారుడితో కలిసి బస్సులో వేములవాడకు వెళ్లింది. గురువారం ఉదయం వేములవాడలో స్వామిని దర్శించుకుని సాయంత్రం ధర్మపురి చేరుకుంది. స్వామివారి దర్శనానికి వెళ్లి ముందు గోదావరిలో స్నానం చేయాలని స్వరూపరాణి భావించింది. ఈ క్రమంలో స్నానం చేసేందుకు కాబోయే వధువు గోదావరి వద్దకు వచ్చింది. బ్యాగు, ఫోన్ ను తన అక్క కుమారుడకు ఇచ్చి నదిలోకి దిగింది.
అయితే ఆమె దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా నీటిలో మునిగి మృతి చెందింది. పిన్నిని రక్షించండి అంటూ స్వరూపరాణి అక్క కుమారుడు పెద్ద ఎత్తున కేకలు వేశాడు. అయిన అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.