తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సెక్రటేరియట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. వచ్చే నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవనం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. తన ఛాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఇక, కొత్త సెక్రరేరియట్ భవనం అద్భుతాన్ని తలపిస్తోంది. ఎంతో సుందరంగా ఓ ఇంద్ర భవనాన్ని పోలి ఉంది. కొత్త సెక్రటేరియట్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రతిబింబించేలా నిర్మించబడింది.
మొత్తం 28 ఎకరాల్లో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో మొత్తం ఏడు అంతస్తులు ఉన్నాయి. ఒక్కో అంతస్తు ఎత్తు 14 అడుగులుగా ఉంది. భవనంపైన ఉన్న రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు జాతీయ చిహ్నాలు ఉంటాయి. మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయి. లుంబినీ పార్క్‌కు ఎదురుగా ప్రధానం ద్వారం ఉంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఈ ద్వారం గుండా సెక్రటేరియట్ లోపలికి వెళుతుంది. ఎన్టీఆర్ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న గేట్ ద్వారా ఉద్యోగులు లోపలికి వెళతారు. సామాన్యులు బిర్లామందిర్ వైపు ఉన్న గేటు నుంచి లోపలికి వెళ్లనున్నారు.
సెక్రటేరియట్ వెనక భాగంలో ఉండే గేటును అత్యవసర సమయాల్లో ఉపయోగించనున్నారు. ఈ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. 3వ అంతస్తునుంచి 5వ అంతస్తు వరకు మంత్రుల కార్యాలయాలు ఉండనున్నాయి. 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉండనుంది. మిగిలిన వాటిల్లో స్టోర్ రూమ్, సిబ్బంది రూమ్స్ ఉంటాయి. లోపల 300 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు ఉంచడానికి అవకాశం ఉంది. 30 కంపార్ట్మెంట్లకు సంబంధించి.. సీఎం నుంచి సామాన్యుడి వరకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంది. మరి, తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.