వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు ప్రిస్కిప్షన్‌పై మందులు రాసే విషయంలో వైద్యులకు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి కీలక ఆదేశాలను జారీ చేసింది. జనరిక్ మెడిసిన్ పేర్లనే ప్రిస్కిప్షన్‌లలో రాయాలని సూచించింది. ఔషధాల బ్రాండ్ నేమ్ మాత్రం రాయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మెడిసిన్ బ్రాండెడ్ పేర్లకు బదులుగా వాటిలోని కాంపౌండ్ మెడిసిన్‌లనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వైద్య మండలి గుర్తుచేసింది. మందుల చీటీల్లో బ్రాండ్ నేమ్ పేర్కొనరాదని ఇటీవల భారతీయ వైద్య మండలి, లోకాయుక్త కూడా చెప్పిన విషయాలను పాటించాలని సూచించింది.
ఇండియన్ మెడిసిన్ కౌన్సిల్, లోకాయుక్త ఆదేశాలకు విరుద్ధంగా వైద్యులు బ్రాండెడ్ పేర్లనే సూచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ వైద్యమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా ఔషధ జనరిక్ పేర్లనే ప్రిస్కిప్షన్‌లో సూచించాలన్నారు. బ్రాండెడ్ మెడిసిన్స్‌తో పోలిస్తే జనరిక్ మెడిసిన్స్ చాలా చౌకగా లభిస్తాయని.. ఒకవేళ ప్రిస్కిప్షన్‌పై బ్రాండెడ్ మెడిసిన్స్ రాస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి హెచ్చరికలు జారీ చేసింది. మరి ప్రభుత్వ ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.