మహిళలకు శుభవార్త అందుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు, మహిళలకు తీపికబురు అందించింది. స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు, మహిళలకు తీపికబురు చెప్పింది. స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాల నిధులను సోమవారం విడుదల చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.500 కోట్లు కాగా, పట్టణ ప్రాంత ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.250 కోట్లు కేటాయించారు. మహిళలు స్వయం ఉపాధి వైపు ద్రుష్టి సారించి వారి కుటుంబానికి ఆసరాగా ఉండటంతో పాటు మరి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఈ రుణాలు ఇప్పిస్తోంది. ఈ రుణాలకు అయ్యే వడ్డీని సైతం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన రూ.750 కోట్లు వడ్డీలేని రుణాల రేపటి(మార్చి 8వ తేదీ)లోగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు అందనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలికల్లో 1.77 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఇందులో దాదాపు 18 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ లేని రుణాల నిధులు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో కూడా తెలంగాణ మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని ఆయన ప్రశంసించారు.
వీటితో పాటు మహిళల కోసమే ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా 100 ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్టు హరీష్ రావు తెలియజేశారు. ఈ క్లినిక్‌లలో ప్రతీ మంగళవారం మహిళల కోసమే ప్రత్యేకంగా వైద్యసేవలందిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 6 లక్షల మంది గర్భిణులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్లను అందజేస్తామని, వచ్చేనెల నుంచి ఈ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.