సమాజానికి మంచి విలువలు నేర్పాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు కొందరు దారులు మరిచి బరితెగిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తూ ఉన్నతమైన ఉపాధ్యాయ ఉద్యోగానికి తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ మాస్టారు పాఠశాల్లో అడుగు పెట్టడమే కాకుండా బడి మెట్లు ఎక్కి హల్చల్ చేశాడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామం. సున్నం కామరాజు అనే ఉపాధ్యాయుడు చిరుతపల్లి పాఠశాలలో గత కొంత కాలంగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. భవిష్యత్ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టర్ అతిగా మద్యం సేవించి పాఠశాల్లో అడుగు పెట్టాడు. దీంతో అడుగు పెట్టడమే కాకుండా హల్చల్ చేశారు. ఈ విషయం గ్రామ సర్పంచ్ కొర్శ నరసింహమూర్తి వరకూ వెళ్లింది.
వెంటనే స్పందించిన ఆయన పాఠశాలకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడుని వెంటనే పాఠశాల నుంచి గెంటేశాడు. దీంతో ఆ ఒక్క రోజు మాస్టారుగా మారిన సర్పంచ్ కొర్శ నరసింహమూర్తి పిల్లలకు పాఠాలు చెప్పి ఇతరులకు మార్గదర్శకుడిగా మారారు. ఇక అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు కామరాజు గత కొంత కాలం నుంచి ఇలాగే ప్రవర్తిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పు రావటం లేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పై అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతను ఇలా ప్రవర్తిస్తున్నాడని, సరైన బుద్ది చెప్పాలని తెలిపాడు. దీంతో పాటు అతనిని ఇక్కడి విధుల నుంచి తొలగించి మరొక ఉపాధ్యాయుడిని నియమించాలని సూచించారు.