పుట్టి మూడు రోజులు కూడా కాలేదు. కళ్లు కూడా సరిగా తెరవలేదు. ఆ మూడు కుక్కపిల్లలు తల్లి చాటు బిడ్డల్లా ఓ చోట జీవిస్తున్నాయి. ఓ రోజు తల్లి తన బిడ్డలకు పాలిచ్చి బయటకు వెళ్లింది. ఆ మూడు కుక్క పిల్లలు తల్లి పాలు తాగి చక్కగా నిద్రపోతున్నాయి. తల్లి తమకు ఉందన్న ధైర్యం.. ప్రపంచం గురించి ఏమీ తెలియని అమాయకత్వం.. ముద్దు, ముద్దుగా ఉన్న ఆ కుక్కపిల్లలు లోకాన్ని మరిచిపోయి నిద్ర పోతున్నాయి. వాటి జీవితం మరికొద్ది సేపట్లో ముగియబోతోందని ఆ చిన్న ప్రాణులకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ నాగు పాము అవి ఉండే చోటుకు వచ్చింది.
ఆ చిన్న కుక్కపిల్లలు తనకు ఏ పాపం తలపెట్టవు అని దానికి తెలుసు. అయినా దాని బుద్ధి క్రూరంగా మారింది. ఆ పసికందులపైకి పడగ విప్పింది. వాటిపై దాడి చేయసాగింది. అవి బాధతో విలవిల్లాడుతున్నా వదలిపెట్టలేదు. కాటు వేయటమే కాదు.. వాటిని బయటకు లాక్కు వచ్చింది. అవి నొప్పితో గిలగిల్లాడుతున్నా కోరల్తో పట్టి బయటకు లాగింది. పాము తన పిల్లలపై దాడి చేస్తున్న సమయంలోనే తల్లికుక్క అక్కడికి వచ్చింది. పామును ఆపటానికి ప్రయత్నించింది. కానీ, ఆ పాము దానిపై కూడా బుసలు కొడుతూ దూకింది. దీంతో తల్లి కుక్క ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోయింది.
దాని మూడు పిల్లలు నాగు పాము కాటుకు బలైపోయాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో జనం చాలా మంది ఉన్నా చిన్న కుక్కపిల్లలకు సహాయం చేయటానికి ముందుకు రాలేకపోయారు. కొంతమంది గట్టిగా అరుస్తూ ఉంటే.. మరికొంతమంది ఆ దృశ్యాలను వీడియో తీయటంలో బిజీ అయిపోయారు. పైగా.. కుక్కపిల్లలు చనిపోతే సింపతీగా ‘‘ ప్చ్!! పాపం’’ అని అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగు పాము అలా చేయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.