10 సంవత్సరాల రాజ్ కుమార్ అందరి పిల్లల లాగే ఆడుకోవాలని కలలు కన్నాడు. కానీ ఓ మాయ రోగంతో మంచాన పడ్డాడు. కన్న కొడుకును బాగు చేయించడం కోసం ఆ తండ్రి ఓ పోరాటాన్నే చేస్తున్నాడు. ఆ పోరాటంలో మనలాంటి వారి సహాయాన్ని దీనంగా కోరుతున్నాడు ఆ పేద తండ్రి.
తండ్రి భుజాల పై నుండి ప్రపంచాన్ని చూడాలని ప్రతీ కొడుకు కలలు కంటాడు. అలానే కల కన్నాడు రాజ్ కుమార్(10). కానీ ఆ కల కలగానే మిగిలిపోయి, నరకం అనుభవిస్తున్నాడు. ఆటపాటలతో ఆడుకోవాల్సిన కొడుకుకు ఇలా అనారోగ్యం పాలవడం చూసి ఆ కన్న తండ్రి రోదించని రోజంటూ లేదు. ఆస్పత్రిలో చూపించడానికి స్థోమత లేదు.. అసలు హస్పటల్ వెళ్లడానికే డబ్బులు లేక కడు పేదరికాన్ని వెళ్లదీస్తున్నాడు రాజ్ కుమార్ తండ్రి శంకర్. ఎముకల వ్యాధితో బాధపడుతున్న రాజ్ కుమార్ ను పట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ.. బిడ్డ ఆరోగ్యం కోసం ఓ పోరాటాన్నే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆపన్న హస్తం కోసం దీనంగా కన్నీరు కారుస్తూ.. ఎదురుచూస్తున్నాడు.
అది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్.. ఉదయం ఏడు గంటలు కావొస్తుంది. ఆ స్టేషన్ దగ్గర ఓ 10 సంవత్సరాల కొడుకును ఒళ్లో పెట్టుకుని, ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటున్నాడు ఓ తండ్రి. అతడి ఎదురుగా అమ్మకానికి తెచ్చిన కొళ్లు కూడా ఉన్నాయి. కోళ్లు ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా? తన కొడుకును ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడానికి వచ్చాడు సిరికొండకు చెందిన శంకర్. ఆ కోళ్లను అమ్మితే వచ్చిన డబ్బులతోనే అతడు ఇంటికి వెళ్లాలి. ఈ బతుకు చిత్రాన్ని గమనించాడు నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు నవీన్. వారి వివరాలు ఆరా తియ్యగా.. సిరికొండకు చెందిన శంకర్ తన బాధను వెళ్లబోసుకున్నాడు.
తన కొడుకు రాజ్ కుమార్ కు మూడు నెలలుగా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని, అతడికి బోన్స్ వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు. ఇక నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, దమ్ము ఎక్కువ కావడంతో.. గురువారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. చికిత్స అనంతం ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో.. శంకర్ తన వెంట తెచ్చుకున్న కోళ్లను విక్రయించడానికి బస్టాండ్ లో కూర్చున్నాడు. అవి అమ్మితే గానీ అతడు ఇంటికి వెళ్లలేని పరిస్థితి.. అంటే ఎంత దీన స్థితిలో ఉన్నాడో అర్థం అవుతుంది. అతడి పరిస్థితి చూసిన నవీన్ తన వంతుగా 2 వేల రూపాయలు ఇచ్చి సిరికొండకు పంపించాడు.
ఇక ఛార్జీలకు డబ్బులు లేకపోవడంతోనే తల్లి రాజ్ కుమార్ వెంట రాలేదని శంకర్ తెలిపాడు. అయితే రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ఏమంత బాలేదని, అతడికి మెరుగైన వైద్యం అందించాలని తెలుస్తోంది. కడు పేదరికంలో బతుకు జీవుడా అంటూ బతుకు ఈడుస్తున్న శంకర్ కు కొడుక్కి వైద్యం చేయించే స్థోమత లేదు. అయితే మనం తలా ఓ చేయి వేస్తే.. రాజ్ కుమార్ ఇతర పిల్లల లాగే ఆడుకుంటాడు. దానికి మీ అందరి సాయం కావాలని ఆ పేద తండ్రి అర్థిస్తున్నాడు. తెలిసిన వారికి సాయం చేస్తే.. ఆప్తుడు అంటారు.. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తేనే దేవుడంటారు. మరి రాజ్ కుమార్ కు మన వంతుగా సాయం చేద్దాం.