ప్రముఖ ఫోక్ సింగర్, బీఆర్ఎస్ నేత సాయిచంద్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తీవ్ర దుఃఖం అనుభవిస్తున్న ఆయన సతీమణి గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు.
ప్రముఖ ఉద్యమ గాయకుడు, జానపద కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేసినటువంటి సాయిచంద్ (39) ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణంతో తెలంగాణ రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సాయిచంద్ భార్య రజనీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. భర్తను కోల్పోయిన బాధలో ఆమె గుండె పగిలేలా రోదిస్తున్నారు. ఈ క్రమంలో గుండె నొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు తొలుత బీఎన్ రెడ్డి నగర్ లోని కోణార్క్ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుర్రంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఆమె ఆహారం, నీరు తీసుకోకపోవడం వల్ల నీరసం వచ్చిందని.. అనంతరం ఒత్తిడి వల్ల గుండె నొప్పి వచ్చినట్లు సమాచారం. సాయిచంద్ భార్య రజనీ అస్వస్థతకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచే జానపద గాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సాయిచంద్.. తెలంగాణ సాధన సమయంలో తన పాటలతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించారు. జానపద పాటలతో సాగే పలు టీవీ షోలలో కూడా సాయిచంద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా పని చేశారు.
అయితే జూన్ 29న గుండెపోటుతో మరణించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్ హౌస్ కి కుటుంబ సభ్యులతో వెళ్లిన సాయిచంద్.. అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సాయిచంద్ ను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త మరణంతో రజనీ తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు. సాయిచంద్, రజనీలది ప్రేమ వివాహం. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అనంతరం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరమవడంతో ఆమె ఆ నరకం నుంచి బయటపడలేకపోతున్నారు.