ఆ తల్లి.. నిజంగానే అనాథో.. లేక అందరూ ఉండి.. ఎవరు పట్టించుకోని అభాగ్యురాలో తెలియదు. అనాథలైనా.. అందరూ ఉన్నావారైనా సరే.. ఆకలిదప్పలు మాత్రం ఒకేళా ఉంటాయి. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం ఒంట్లో శక్తి ఉన్నవారు కష్టపడి పని చేసుకుంటారు. ఒపిక లేనివారు.. ఆదుకుని.. పట్టెడన్నం పెట్టేవారి కోసం ఎదురు చూస్తారు. కొందరు అభాగ్యులు.. దుకాణాల ముందు.. రేషన్ షాపలు వద్ద కింద పడ్డ బియ్యం గింజలు ఏరుకుని.. వాటితో కడుపు నింపుకుంటారు. తాజాగా ఓ మహిళ కూడా ఇలానే బియ్యం ఏరుకుంటూ ప్రమాదానికి గురయ్యి మృతి చెందింది. ఎలా అంటే.. మృతురాలు.. రైలు పట్టాల మీద పడ్డ బియ్యం గింజలు ఏరుకోవడం కోసం గూడ్స్ రైలు కిందకు వెళ్లింది. ఇంతలో అది కదలడంతో.. పట్టాల మీద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక సంఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో చివరి ట్రాక్‌పై గూడ్స్ రైళ్లను నడుపుతారు. ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ క్రమంలో బస్తాల నుంచి జారిపడే బియ్యాన్ని ఏరుకోవడానిక చాలా మంది కూలీలు, యాచకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం బియ్యం ఏరుకునేందకు బాధిత మహిళ.. గూడ్స్ రైలు కిందకు వెళ్లింది. బియ్యం ఏరుకుంటూ ఉండగా.. సడెన్‌గా రైలు కదిలింది. దాంతో ఆ మహిళ.. బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందింది. ఇక మృతురాలు పేరు గంగవ్వ అని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.