రాజధాని హైదరాబాద్ అంటేనే వేల వాహనాలు. వీటిని వేగంగా నడిపేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. రాత్రివేళ దూసుకెళ్లి ప్రమాదాలు చేసే వారు కూడా తక్కువేం కాదు. ఇకపై ఈ వేగానికి అడ్డుకట్ట పడనుంది. జీహెచ్ ఎంసీ, పోలీసు, రవాణాశాఖ అధికా రులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించింది. వాహన వేగానికి సరిపడేలా రోడ్లు డిజైన్ చేయడంతో వేగం పెరిగినా సురక్షితంగా వాహనదారుడు గమ్యం చేరేందుకు వేగపరిమితిని నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మోటారు వాహన భద్రతా చర్యల్లో భాగంగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో వేగాన్ని నియంత్రిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డివైడర్ ఉన్న రహదారిపై కార్ల గరిష్ఠ వేగం గంటకు 60 కిలోమీటర్లు మించకూడదు. డివైడర్లు లేని రోడ్లపై అయితే 50 కి.మీ., కాలనీ రోడ్లపై 30 కి.మీ. వేగం దాటకూడదు. వస్తు రవాణా లారీలు, బస్సులు, ఆటోలు, మోటారు సైకిళ్లు.. డివైడర్ ఉన్న రహదారిపై 50 కి.మీ., డివైడర్ లేని రోడ్డుపై 40 కి.మీ., కాలనీ రోడ్లలో 30 కి.మీ. వేగంలోపే వెళ్లాలని ఉత్తర్వుల్లో రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Teacher: పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ ఘన కార్యం! పూటుగా మద్యం తాగి వచ్చి..
పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలకు వివిధ శ్లాబుల్లో చలానాలు విధించేందుకు ట్రాఫిక్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కనీస వేగానికి మించి వాహనం నడిపితే.. వేగాన్ని గుర్తించి ఎంత జరిమానా విధించాలి అన్న దానికి వీలుగా కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు 50 కి.మీ. పరిమితి ఉన్నప్పుడు దానికి మించి ఎన్ని కి.మీ. వేగంగా వెళ్తుందో పరిశీలించి, పరిమితి 10 కి.మీ. దాటితే ఓ రకం, 20 కి.మీ. దాటితే కాస్త ఎక్కువ, అలాగే 30 కి.మీ. దాటితే మరింతగా చలానాలు విధిస్తారు. వాహనవేగాన్ని గుర్తించడానికి మరిన్ని ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారని సమాచారం.