గాడిద పాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీలో గాడిద పాలనే వాడుతున్నారు. గాడిద పాలకు ఉన్న డిమాండ్‌ను గ్రహించాడో యువ పాడిరైతు. అంతే తక్కువ టైమ్‌లో ఫుల్ సక్సెస్ అయ్యాడు.
మన దేశంలో ఎక్కువగా గేదె, ఆవు పాలను తాగుతారు. టీ, కాఫీ, స్వీట్ల తయారీలోనూ వీటినే వినియోగిస్తారు. డెయిరీ ఫామ్ బిజినెస్‌లో కూడా వీటిదే హవా. అయితే ఓ యువకుడు మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు. గాడిద పాలతో వ్యాపారం చేయాలనుకున్నాడు. కష్టపడి ఫుల్ సక్సెస్ అయ్యాడు. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అని వేమన అప్పట్లో గాడిద పాలను అంత విలువలేనిదిగా భావించి పద్యం రాశారేమో. కానీ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువరైతు మాత్రం కోట్లిచ్చును ఖరము పాలు అనేలా.. గాడిద పాలతో బాగా సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరి బాటలో కాకుండా వినూత్న మార్గాన్ని ఎంచుకుని, శ్రమించి విజయవంతమైన అతడి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..
నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వెల్గొండకు చెందిన పులిదండ నగేష్ కుటుంబం వినూత్న వ్యాపార ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ ఆవు, గేదె డెయిరీలకు భిన్నంగా గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేసి సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. నగేష్ పెద్ద కొడుకు అఖిల్ వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఒక రోజు యూట్యూబ్‌లో చూస్తుండగా డాంకీ ఫామ్‌పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్లో గుర్రాలు, గాడిదల పెంపకం, పాల ఉత్పత్తుల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వెచ్చించి మొత్తం 60 శ్రేష్టమైన గాడిదలు కొన్నాడు. ఫామ్‌తో పాటు గాడిదలకు దాణా కోసం వివిధ రకాలు గడ్డి పెంచేందుకు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు.
గాడిదలను చూసుకునేందుకు రెండు కుటుంబాలను తమిళనాడు నుంచి రప్పించి వాటికి వసతి కల్పిస్తున్నాడు అఖిల్. గతేడాది నవంబర్ 13న ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 23 గాడిదలు పాలు ఇస్తున్నాయి. గాడిద పాలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్‌లో మాత్రమే ఉంచాలి. లీటర్ గాడిద పాలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలుకుతోంది. పెద్దమొత్తంలో పాలు ఉత్పత్తి అయితే ఇంకా అధిక ధరతో నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే చాన్స్ ఉంది. డాంకీ ఫామ్ బిజినెస్ లాభదాయకమే గానీ మంచి బ్రీడ్, ఏజెన్సీని ఎంచుకోవాలని పులిదండ నగేష్ చెప్పాడు.
ఇక, గాడిద పాలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. గాడిద పాలు ఆవు పాలకు ప్రత్యామ్నాయమని, తల్లి పాలకు సమానమైన పోషక విలువలు ఉన్నాయని చెబుతున్నారు. విటమిన్స్, మినరల్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ వీటిల్లో ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తాయంటున్నారు. గాడిద పాలు తాగితే గుండె ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. మరి.. డాంకీ ఫామ్‌తో సక్సెస్ అయిన యువకుడి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.