తెలిసిన వారే మోసం చేసే ఈ రోజుల్లో ఓ యువతి ముక్కు మొహం తెలియని యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని మోసానికి గురైంది. మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే దాగిఉంటుంది. మనం ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతామో వారిచేతిలోనే ఎక్కువగా మోసపోతాము. ఆ యువతి కూడా అలాగే నమ్మి మోసపోయింది.
సోషల్ మీడియా పుణ్యమా అని ముఖ పరిచయాలు లేకున్నా ఫెస్ బుక్ ఇన్‌స్టాగ్రామ్ లలో పరిచయమై రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఒకరికి ఒకరు ఫోటోలకు, వీడియోలకు లైకులు కామెంట్స్ ఇచ్చుకుంటూ ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. దీంతో కొన్నాళ్లు స్నేహం చేసి ఆ తరువాత లవ్ ట్రాక్ లో పడిపోతున్నారు. ఇదే విధంగా ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడితో స్నేహం చేసింది. కొంత కాలం వరకు చాటింగ్ చేసుకుంటూ కాలం గడిపారు. ఓ రోజు ఆ యువతి ఆయువకుడిని ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన యువకుడు చేసిన పనికి షాక్ అయ్యింది ఆ యువతి. వివరాల్లోకి వెళ్తే..
సురేష్ అనే యువకుడు అమ్మయిలతో పరిచయాలు ఏర్పార్చుకోవాలనే ఉద్దేశ్యంతో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లో వేరే అందమైన యువకుడి ఫోటోను పెట్టుకున్నాడు. నగరంలోని మూసాపేటకు చెందిన ఓ యువతి ఆ యువకుడి ఫొటోకు లైక్ కొట్టింది. ఆ తరువాత చాటింగ్ చేసుకుని ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ఆ అమ్మాయిని మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సురేష్ ని ఇంటికి ఆహ్వానించింది.
ఇదే అదనుగా బావించిన సురేష్ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అమ్మాయితో మాటలు కలిపి తనకు కూల్ డ్రింక్ కావాలని కోరాడు. పరిచయమున్న వ్యక్తే కదా అని షాప్ కు వెళ్లింది. ఆ యువతి బయటికి వెళ్లగానే బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారాన్ని దొంగిలించాడు. యువతికి అనుమానం రాకుండా మళ్లీ కలుద్దామని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ కొన్ని రోజులకు యువతి సురేష్ ను ఇంటికి పిలిచింది. ఈ సారి ఏకంగా 20 తులాల బంగారాన్ని కాజేసి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ యువతి తల్లి బీరువాను సర్ధే క్రమంలో నగలు చోరికి గురయ్యాయని గుర్తించింది. ఇంట్లో ఉన్న కూతుర్ని నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ యువకుడి నుంచి 26 తులాల బంగారాన్ని రికవరీ చేసి జైలుకు తరలించారు పోలీసులు.