ఊరు, వాడ ఏకం అయ్యి చేసుకునే పండుగ వినాయక చవితి. హిందువులకు ఆది దేవుడు గణపతి కావడం వల్ల ఎంతో భక్తి, శ్రద్ధలతో, నియమ, నిబంధనలతో వినాయకుడ్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రతి వీధికో మండపం వెలుస్తోంది. ఎన్ని మండపాలు ఉన్నా, ఎన్ని విగ్రహాలను ఏర్పాటు చేసినా.. అందరి చూపు ఖైరతాబాద్ వినాయకుడి వైపు.. అయితే...
వినాయకచవితి.. హిందువులకు చాలా ఇష్టమైన పండుగ. వినాయక ఉత్సవాలు ప్రతి ఊరిలో ఆనందాన్ని తీసుకొస్తాయి. వినాయక మండపాలు ఏర్పాటు చేసి.. అందులో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని.. నిమజ్జనం రోజు వరకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. వినాయకచవితి అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ వైపు మళ్లుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఖైరతాబాద్ మహాగణపతి కమిటీ గత 68 సంవత్సరాలుగా ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణపయ్య చాలా ప్రత్యేకం. వినాయకచవితికి ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నా.. ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అప్పుడే ఆ పనులను ప్రారంభించింది.
గత ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చాడు. ఈసారి.. ఆ ఎత్తుని 61 అడుగులకి పెంచబోతున్నట్టు కమిటీ సభ్యులు తెలియజేశారు. విగ్రహ పనులను మొదలు పెట్టే ముందు ఇక్కడ కర్ర పూజా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చవితికి మూడు నెలల ముందే నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి.. ఇక్కడ పనులు మొదలు పెడుతారు. ఇందులో భాగంగానే ఈ బుధవారం సాయంత్రం కర్రపూజతో విగ్రహ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈసారి 61 అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేయిస్తున్నట్టు మహాగణపతి ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్‌రాజ్ తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్, ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో మట్టి మహాగణపతిని తయారు చేయనున్నట్లు వెల్లడించారు.