సిటీ ప్రజలకు బీ-అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలల పాటు వాహనాలను మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ల గురించి తెలుసుకుంటే బెటర్.
హైదరాబాద్ వాసులకు బీ-అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌కు దగ్గరలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నేషనల్ హైవే-65 మీదుగా నాలా పనులు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు ఆంక్షలు ఉండనున్నాయి. ఈ రూట్లలో 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్, బేగంపేట్ వైపు.. బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు.. అలాగే మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే వెహికిల్స్‌ను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.