భారీ వర్షాలతో ఆ గ్రామం వరదనీటిలో చిక్కుకుపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఆ ఊరికి ఎలాగైన విద్యుత్ అందించాలని ఆ విద్యుత్ ఉద్యోగి చూపిన తెగువ వృత్తిపట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు కురవడంతో చెరువులు, వాగులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జన జీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అతిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిలువ నీడలేక, తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థతో పాటు విద్యుత్ వ్యవస్థపై కూడా పడింది. భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో కరెంట్ స్థంబాలు కూలిపోయి, విద్యుత్ వైర్లు తెగిపోయి పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ విద్యుత్ ఉద్యోగి చేసిన పనికి సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ ఉద్యోగి ఏం చేశాడంటే..
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వర్షంలో విద్యుత్ స్థంబాలను ముట్టుకోకూడదని ప్రజలకు పలు సూచనలు చేసింది. కాగా వర్షాల వల్ల దెబ్బతిన్న కరెంట్ పోల్స్ ను, ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్ తీగలను పునరుధ్దరించే పనిలో విద్యుత్ అధికారులు నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో కరెంట్ హెల్పర్ కొప్పుల సంతోష్ ప్రాణాలకు తెగించాడు. భారీ వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి కరెంట్ తీగలను సరిచేసి గ్రామానికి కరెంట్ వచ్చేలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేట జిల్లా పాతర్ల పహాడ్ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి.
అయితే వరద నీటి మధ్యలోని ఓ స్తంభం వద్ద వైర్లు తెగిపోవడంతో ఆ గ్రామానికి కరెంట్ లేకుండా పోయింది. దీంతో విద్యుత్ ఉద్యోగి కొప్పుల సంతోష్ ప్రాణాలకు తెగించి వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి తీగలకు మరమ్మత్తులు చేశాడు. దీంతో అంధకారంలో ఉన్న పాతర్ల పహాడ్ గ్రామానికి కరెంట్ వచ్చింది. దీంతో విద్యుత్ ఉద్యోగి కొప్పుల సంతోష్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ గా మారింది.
కరెంట్ ఇవ్వడం కోసం నీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తు చేసిన విద్యుత్ ఉద్యోగికి హ్యాట్సాఫ్
సూర్యాపేట – ఇంత భారీ వర్షంలో కూడా అంతరాయం లేకుండా కరెంట్ వస్తుందంటే అది విద్యుత్ ఉద్యోగుల కృషి వల్లే.
పాతర్ల పహాడ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురవుతున్న ప్రాంతం… pic.twitter.com/sge26VnAgo
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2023