రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్– విజయవాడ రూట్. ఈ రూట్ లో రోజుకు లక్షల్లో ప్రజలు వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి బిగ్ అలర్ట్ ఒకటి అధికారులు జారీ చేశారు. రానున్న ఐదు రోజులు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అందుకు తగినట్లు ట్రాఫిక్ ఎలా మళ్లించాలి? ఎక్కడ డైవర్ట్ చేసి మళ్లీ తిరిగి జాతీయ రహదారి 65పైకి తీసుకురావాలి అనే అంశాలను సవివరంగా వెల్లడించారు. పెద్దగట్టు జాతర దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆంక్షలను విధించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు తగిన సూచనలు, మళ్లింపు మార్గాలను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సవివరంగా వెల్లడించారు. ఈ నెల 5 తెల్లవారుజాము నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయన్నారు. అలాగే ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలో దారి మళ్లించనున్నారు. టేకుమట్ల వంతెన వద్ద ఎన్ హెచ్ 65 నుంచి ఖమ్మం వైపు వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. గుంజులూరు స్టేజ్ వద్ద మళ్లీ తిరిగి జాతీయ రహదారి 65 మీదకు వెళ్లవచ్చు. హెవీ వెహికిల్స్ అయితే.. టేకుమట్ల నుంచి ఖమ్మం హైవే మీదుగా నాయకన్ గూడెం నుంచి కోదాడ వైపు మళ్లిస్తారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను దురాజ్ పల్లి సమీపంలోని స్వామి నారాయణ ట్రస్ట్ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వ నుంచి టేకుమట్ల బ్రిడ్జి వద్దకు మళ్లిస్తారు. హెవీ వెహికల్స్ అయితే.. మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్ పల్లి వద్ద ఎన్ హెచ్ 65 మీదకు దారి మళ్లిస్తారు.