గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క కరోనాతోనే చస్తున్నాం అంటే.. డెల్టా వేరియంట్.. ఒమిక్రాన్ వేరియంట్ అంటూ కొత్త కొత్త వేరియంట్స్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒమిక్రాన్… ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొత్త కరోనా వేరియంట్. సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రపంచ దేశాలు ఇప్పుడీ కొత్త ముప్పు నుంచి తప్పించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఒకసారి కరోనా బారినపడిన వ్యక్తికి కూడా ఈ వేరియంట్ సులభంగా సోకుతుందని అంటున్నారు. కేంద్రం కూడా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
ఒమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేశారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిర్మల్, కుమరం భీమ్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడి కోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. అన్ని రకాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు. కరోనా పరీక్షలను ఎక్కువగా చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మందులను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.