సాధారణంగా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాహనాలకు పాదచారులు, ఆటోలు, రిక్షాలు.. ఇలా వ్యక్తులు, వాహనాలు అడ్డొస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు పశువులు కూడా అడ్డుగా వస్తాయి. కొన్నిసార్లు పశువుల వల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. నిజానికి రోడ్డుపైకి పశువులను తీసుకురావడం నిబంధనలు ఉల్లఘించినట్లే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో పాడిపై ఆధార పడుతున్న రైతులను ఏమీ అనలేం. వాటిని బయట తిప్పి మేపితేనే సాయంత్రం కాసిని పాలిస్తాయి. అడ్డొచ్చినప్పుడు కాస్త కోపం వచ్చినా ఏమీ అనలేని పరిస్థితి.
అయితే సామాన్యులు అయితే ఏమీ అనలేరు. కానీ, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందాన ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. రోడ్డుపై వెళ్తున్న కలెక్టర్ కారుకే పశువులు అడ్డొచ్చాయి. ఎంత హారన్ కొట్టినా అవి పక్కకు జరగలేదు. ఇంకేముంది కలెక్టర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ పశువుల కాపరికి జరిమానా కూడా విధించారు. చేసేది లేక ఆ పశువుల కాపరి ఫైన్ కట్టి వదిలేయాలని బతిమాలుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికులు నిరసనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన యాకయ్య అనే పశువులకాపరి రోజూ పాడి గేదెలను అడవికి తోలుకెళ్తాడు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా అడవికి బయల్దేరాడు. అయితే మార్గం మధ్యలో అటుగా వస్తున్న కలెక్టర్ కారుకు యాకయ్య గేదెలు అడ్డుగా వచ్చాయి. ఎంత హారన్ కొట్టినా ఆ గేదెలు తప్పుకోలేదు. యాకయ్య కూడా వాటిని పక్కకు తోలకుండా ఫోన్ లో బాగా బిజీగా ఉన్నాడట. ఇంక చిర్రెత్తుకొచ్చిన కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఇంకేముంది రంగంలోకి దిగిన అధికారులు.. యాకయ్య గేదెలు హరితహారం మొక్కలు తిన్నాయని చెబుతూ జరిమానా విధించారు. యాకయ్యకు మొత్తం రూ.7,500 జరిమానా విధించారు. చేసేది లేక యాకయ్య కూడా ఆ జరిమానా కట్టారు. స్థానికంగా ఈ విషయం తెలుసుకుని పశువులకాపరులు అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పశువులు అడ్డుగా వస్తే జరిమానా విధించారనే వార్త ఇప్పుడు స్థానికంగా వైరల్ అవుతోంది.