కుటుంబ భారాన్ని మోసే తండ్రి మృత్యువాత పడ్డాడు. బిడ్డల కడుపు నింపడం కోసం ఆ తల్లి వంట మనిషిగా మారింది. చిన్నప్పటి నుంచి తల్లి కష్టం చూస్తూ పెరిగిన యువకుడు.. ఆమె పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. ఆ వివరాలు..
కష్టం అనే పదానికి మన సమాజంలో చాలా మంది సరైన అర్థం తెలీదు. అన్ని అమర్చి పెట్టే తల్లిదండ్రులు ఉండి.. కావాలసిన కనీస సౌకర్యలు కల్పిస్తున్నా సరే.. చిన్న చిన్న విషయాలకే కుంగి పోయి.. తామేదో కష్టాల సుడి గుండంలో చిక్కుకున్నామనే భ్రమలో.. అందమైన నూరేళ్ల జీవితానికి అర్థం లేకుండా అర్ధాంతరంగా ముగించేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారు ఒక్కసారి ఈ యువకుడి జీవితం గురించి తెలుసుకుంటే.. అసలు జీవితం అంటే ఏంటో.. కష్టమంటే ఏంటో పూర్తిగా అర్థం అవుతుంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా అమ్మానాన్న ఉన్నారనే ధైర్యం ఉంటుంది. కానీ అతడికి తండ్రి దూరమయ్యాడు. కుటుంబ పోషణ భారం తల్లి మీద పడింది. తాను పడ్డ కష్టం తన బిడ్డ పడకూడదని భావించినా తల్లి.. కొడుకును బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఆ ప్రకారమే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. కొడుకును బాగా చదివించింది.
తల్లి కష్టం చూస్తూ.. బాధ్యతగా పెరిగిన ఆ యువకుడు.. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లోనే చదువుతూ.. బీటెక్ పూర్తి చేశాడు. మంచి జాబ్ సాధించాడు. కానీ తన తల్లి కష్టానికి ప్రతిఫలం ఈ జాబ్ కాదని భావించాడు. అందుకే సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు. జాబ్ చేస్తూ.. చదవడం కష్టంగా ఉండటంతో.. ఉద్యోగం మానేశాడు. అప్పుడు కూడా ఆ తల్లి అతడికి మద్దతుగా నిలబడింది. కొడుకు చదువుకోవడం కోసం తాను తిరిగి వంట మనిషిగా మారింది. ఈసారి మరింత పట్టుదలతో చదవిని ఆ కుర్రాడు.. సివిల్స్‌లో సత్తా చాటి.. తల్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడమే కాక.. మరో నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. అతడే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పరిధిలోని తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి రేవయ్య.
తాజాగా ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో డోంగ్రి రేవయ్య.. ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంక్ సాధించాడు. తుంగేడ గ్రామానికి చెందిన మనోహర్, విస్తారి భాయ్ దంపతుల కుమారుడు రేవయ్య. కొన్నాళ్ల క్రితం తండ్రి మరణించాడు. తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మాస్టార్‌గా పని చేస్తుంది. రేవయ్య బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. కాగజ్ నగర్‌లోని శిశుమందిర్‌లో ఐదో తరగతి వరకు చదివాడు. అనంతరం.. ఐదు నుంచి పదో తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు రేవయ్య. ఆ తర్వాత మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు.
కానీ ఆ పని అతడికి సంతృప్తి ఇవ్వలేదు. దాంతో ఉద్యోగం చేస్తూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాడు. అయితే పని చేయడం వల్ల సరిగా చదవలేకపోతున్నానని భావించి.. ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌పై దృష్టి కేంద్రీకరించాడు రేవయ్య. తల్లి కూడా కొడుకుకు మద్దతు తెలిపింది. అంతేకాక కుటుంబ పోషణ భారం ఆమెనే చూసుకుంది. తాను జాబ్ మానేయడంతో.. తల్లి పాఠశాలలో వంట చేస్తూ.. కష్టపడుతుండటం చూసి.. బాధ అనిపించినా.. తన లక్ష్యాన్ని మాత్రం పక్కన పెట్టకుండా అకుంఠిత దీక్షతో చదివి.. అనుకున్న లక్ష్యాన్ని చేధించాడు. రేవయ్య మొత్తంగా సివిల్స్ తుది ఫలితాల్లో 410వ ర్యాంకు సాధించాడు. తన తల్లి పడిన కష్టానికి ప్రతిఫలం అందించి.. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మరి రేవయ్య సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.