ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదు. ఏదో ఒక మూల కూర్చొని వచ్చి పోయే వాహనాలను ఫోటోలు కొడుతున్నారు. దీని వల్ల పేదవారికే నష్టం ఎక్కువ. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో భయపెడుతోన్న జనాలను మరింత భయపెట్టకండి.. వారి పైన కాస్తైనా దయ చూపండి.. ఓవైసీ.
హైదరాబాద్ మహా నగరంలోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక మూలన కూర్చుని వచ్చి పోయే వాహనాలకు చలాన్లు వేసే పనిలో నిమగ్నమై ఉంటున్నారని వారి విధుల గురుంచి అసెంబ్లీ వేదికగా దుయ్యబట్టారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో నిత్యవసర వస్తువులని చూసి భయపడుతున్న జనాలు.. ఇప్పుడు వారిని చూసి కూడా పరేషాన్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదు. ఏదో ఒక మూల కూర్చొని వచ్చి పోయే వాహనాలను ఫోటోలు కొడుతున్నారు. లేదంటే చలాన్లు రాస్తున్నారు. ఇది విధులు నిర్వహించినట్టు కాదు. కరోనా తర్వాత అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి. ఆయిల్, గ్యాస్, పెట్రోలు, డీజిల్.. ఇలా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. వాటితోనే జనం ఇబ్బంది పడుతుంటే.. ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ట్రాఫిక్ పోలీసులను చూసి మరింత పరేషాన్ అవుతున్నారు. అందులోనూ ట్రాఫిక్ చలాన్లతో పేదవారే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వారిపైనకాస్తైనా దయ చూపండి. చిన్న చిన్న చలాన్లు ఉంటే మాఫీ చేసే ఆలోచన చేయండి..” అని ఒవైసీ అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు.
అలాగే.. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై ఒవైసీ ప్రశంశల వర్షం కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి 36 కోట్ల రూపాయలు కేటాయిస్తే, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 2000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ముస్లింలు అందరూ క్షేమంగానే ఉన్నారని అక్బరుద్దీన్ ఒవైసీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. ట్రాఫిక్ పోలీసులపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అంగీకరించదగినవేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.