బాలింతలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, ప్రభుతాసుపత్రుల్లోనే పురుడు పోసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరచూ చెపుతోంది. అయితే.. అవి మాటలకే పరిమితం అన్నట్లుగా బాలింతల నరకయాతన అనుభివిస్తున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గతేడాది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటన మరవకముందే.. జగిత్యాల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పురుడు పోసుకున్న 6 మంది తల్లులకు వేసిన కుట్లు ఊడిపోయాయి. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాలింతల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాలింతలనే కనికరం లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిస్తారంటూ వైద్యుల తీరుపై బాలింతల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఇలా ఒకరు, ఇద్దరు కాదని ఆరుగురు గర్భణీలకు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్లు ఊడిపోయి బాధపడుతున్న ఆరుగురు బాలింతల్లో ఇద్దరికి కుట్లు వేయగా.. మరో నలుగురికి కుట్లు వేయాల్సి ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర చీము పూర్తిగా పట్టేసిందని ఆందోళన చెందారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. వైద్యులు, సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని బాలింతలు వాపోయారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హాస్పిటల్ కు చేరుకుని ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లు ఊడిపోయి నరకయాతన అనుభవిస్తున్న మహిళలతో ఆమె మాట్లాడారు. బాలింత మహిళలు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుతాసుపత్రుల్లోనే పురుడు పోసుకోవాలని, అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కానీ, ఆసుపత్రుల్లో మాత్రం వైద్యుల నిర్లక్ష్యంతో.. రోగులు ఏమైపోతారో తెలియని పరిస్థితి నెలకొంటుందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.