టీమిండియా.. తొలి వన్డేలో అద్భుత విజయం సాధించింది. చివరివరకు టెన్షన్ పెట్టిన మ్యాచులో కష్టం మీద గెలిచింది. రాయ్ పుర్ లో జనవరి 21న జరగబోయే తర్వాతి మ్యాచ్ కోసం ఫుల్ ప్రిపరేషన్ లో ఉంది. ఇలాంటి టైంలో భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. భారీ మొత్తంలో జరిమానా పడింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన జట్టు ఇలా ఎలా చేసిందని అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందనేది తెలియాలంటే.. స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్.. 208 పరుగులతో కేక పుట్టించే ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్నో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. ఇక టార్గెట్ ని ఛేదించే క్రమంలో ఓ సందర్భంలో తడబడ్డ కివీస్.. బ్రాస్ వెల్ అద్భుతమైన బ్యాటింగ్ తో రేసులోకి వచ్చింది. కానీ చివరి ఓవర్ లో శార్దుల్ అద్భుతమైన యార్కర్ కు అతడు ఔటైపోయాడు. మ్యాచ్ మన సొంతమైంది.
అయితే ఈ మ్యాచులో నిర్ణీత సమయానికంటే భారత జట్టు మూడు ఓవర్లు ఆలస్యంగా వేసిందని మ్యాచ్ రిఫరీ జవగళ శ్రీనాథ్ చెప్పుకొచ్చారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్టర్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఓవర్ కు 20 శాతం చొప్పున మూడు ఓవర్లు ఆలస్యమైనందుకు 60 శాతం మొత్తాన్ని టీమిండియా మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఇది జట్టులోని ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో వాదనలు ఏం ఉండవని, ఇప్పటికే రోహిత్ శర్మ.. దీన్ని ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. మరి భారత జట్టు జరిమానా పడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.