టీ20 ప్రపంచ కప్ 2022 జరుగుతుంది ఆస్ట్రేలియాలో.. కానీ అక్కడ వినిపిస్తుంది మాత్రం టీమిండియా ఆటగాళ్ల పేర్లే. అద్భుతమైన ఆటతో సెమీస్ కు దూసుకెళ్లిన భారత్.. కప్ కొట్టాలని కసిగా ఉంది. ఇక ఈ టోర్నీలో తన భీకరమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు మిస్టర్ ఇండియన్ 360 బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. తాజాగా జింబాబ్వే పై చెలరేగి ఆడిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. మరే బ్యాటర్ కు సాధ్యం కానీ షాట్లు ఆడి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రపంచ దిగ్గజాలు సైతం SKY పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వసీం అక్రమ్ అయితే ఏకంగా గ్రహాంతర వాసి అంటూ కితాబిచ్చాడు. దాంతో ఇంటా.. బయట సూర్య నామమే జపిస్తు.. అతడి గురించి గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. సూర్య ఆస్తులు ఎంత? ఏ కార్లు వాడుతున్నాడు? అతడి గతం ఏంటి లాంటి వన్నీ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడి ఆస్తుల విలువ ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సూర్య కుమార్ యాదవ్.. టీ20 ప్రపంచ కప్ లో ఓ సంచలనం. వరల్డ్ కప్ లో ఆడిన 5 మ్యాచ్ ల్లో 225 పరుగులు చేసి.. ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అటు ఆటలోనే కాక సంపాదనలోనూ దుమ్మురేపుతున్నాడు సూర్య కుమార్. 2011 IPLల్లో రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అక్కడ నిలకడైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు సూర్య. దాంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. 2021లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ నుంచి గ్రేడ్ సీ కాంట్రాక్ట్ ద్వారా సూర్య కుమార్ కు వార్షిక వేతనం కింద కోటి రూపాలు వస్తోంది. అదీ కాక ముంబై ఇండియన్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గాను రూ. 8 కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు. నెలకు కోటీ రూపాయాలు అర్జించే సూర్య సంపాదన రూ. 30 కోట్ల నెట్ వర్త్ గా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదీ కాక మాగ్జిమా వాచ్, నీమాన్స్ ఫుట్ వేర్, పింటో పీనట్, సరీన్ స్పోర్ట్స్ వంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తు కోట్లు సంపాదిస్తున్నాడు SKY. ఇక సూర్య దగ్గర విలువైన లగ్జరి కార్లు, బైక్ కలెక్షన్స్ ఉన్నాయి. SKY గ్యారేజ్ లో రూ. 40 లక్షలు ఖరీదు గల టయోటా ఫార్చునర్, రూ. 75 లక్షల ఖరీదైన BMW 5 సిరీస్ 530 డీ ఎమ్ స్పోర్ట్స్ కారు, హల్క్ జీపు, నిస్సాన్ జోంగా, రేంజ్ రోవర్, హ్యూండాయ్ ఐ20 లాంటి కార్లతో పాటుగా హార్లీ డేవిడ్ సన్, సుజుకీ హయబుసా వంటి బైక్ లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందరి చూపు సూర్య పైనే ఉన్నందున పలు కంపెనీలు తమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని క్యూలు కడుతున్నాయి. అదీ కాకా టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిస్తే.. సూర్య రేంజ్ పెరిగిపోయి రోహిత్, విరాట్ సరసన చేరతాడని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.