టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు పాకిస్థాన్ టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉంది. అందుకు కారణం వారి బౌలింగ్ ఎటాక్ దుర్భేద్యంగా ఉండటమే. టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షాహీన్ షా అఫ్రిదీ, యువ బౌలర్ నసీమ్ షా, హరీస్ రౌఫ్‌తో వారి పేస్ విభాగం సూపర్‌గా ఉంది. కానీ.. టోర్నీ ఆరంభమైన తర్వాత అసలు డొల్లతనం బయటపడింది. గాయానికి చికిత్స తర్వాత జట్టులోకి తిగిరి వచ్చిన అఫ్రిదీ దారుణంగా విఫలం అయ్యాడు. అతని వైఫల్యం మొత్తం పాక్ జట్టుపై పడింది. ఫలితంగా టీమిండియాతో పాటు జింబాబ్వేపై కూడా పాకిస్థాన్ ఓడిపోయింది. గాయానికి ముందు పేస్‌తో భయపెట్టిన అఫ్రిదీ.. గాయం తర్వాత ఒక సాధారణ మీడియం పేసర్‌ను తలపిస్తున్నాడు.
ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అఫ్రిదీ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ ఒక్క వికెట్ కూడా ఆదివారం పసికూన నెదర్లాండ్స్‌పై తీసుకున్నాడు. అంతకు ముందు టీమిండియా మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అఫ్రిదీ.. 34 పరుగులు వేసి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అలాగే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 29 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఇలా పాకిస్థాన్ బలంగా మారతాడనుకున్న ప్రధాన బౌలర్ షాహీన్ అఫ్రిదీ ఒక సాధారణ మీడియం పేస్ బౌలర్‌గా మారిపోయాడు. దీంతో అతనిపై, అతని ఫిట్‌నెస్, పేస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సరైన ఫిట్‌నెస్ లేకుండానే వరల్డ్ కప్ ఆడుతున్నాడని, గతంలో ఉన్న పేస్ అతని బౌలింగ్‌లో ఇప్పుడు లేదని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.
తాజాగా ఈ విమర్శలపై స్పందించిన అఫ్రిదీ.. ‘నేను నా వందశాతం ఎఫర్ట్ పెడుతున్నాను. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా నా పేస్ ఉంది. 135-140 మధ్య వేగంతోనే నా బౌలింగ్ ఉంటోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాను. కానీ.. మ్యాచ్ ఫిట్‌నెస్ వేరే. అయినా మూడు నెలల గ్యాప్ తర్వాత ఆడుతుంటే పూర్తి ఎఫర్ట్ పెట్టడం కొంచెం కష్టమే. విరామం తర్వాత రాగానే గతంలా ఎఫెక్టివ్‌గా ఉండటం సాధ్యం కాదు.’ అని అఫ్రిదీ పేర్కొన్నాడు. తాను పూర్తిగా ఫిట్‌గా లేననే విషయాన్ని చెప్పకనే చెప్పిన అఫ్రిదీ.. గ్యాప్ తర్వాత గతంలో పెట్టినంత ఎఫర్ట్ ఇప్పుడు పెట్టలేకపోతున్నట్లు తెలిపాడు. కాగా.. అఫ్రిదీ మోకాలికి గాయం కారణంగా అతను ఆసియా కప్ 2022లోనూ ఆడని విషయం తెలిసిందే.
It’s not been easy for Shaheen Afridi after three months out with a knee injury 😣#T20WorldCup
— ESPNcricinfo (@ESPNcricinfo) October 30, 2022