‘క్యాచెస్ విన్ ద మ్యాచెస్’ అనేది క్రికెట్‌లో ప్రఖ్యాత నానుడి. ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ మొత్తం మలుపు తిరిగిన సందర్భాలు కోకొల్లలు! తాజాగా అలాంటి ఓ చక్కటి అవకాశాన్నే స్టోక్స్ అందిపుచ్చుకోలేకపోయాడు.
ముందు 1999 వన్డే ప్రపంచకప్‌లో ఏం జరిగిందో చెప్పుకుందాం! ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లో సమతూకంగా కనిపించింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సఫారీ జట్టు అందుకు తగ్గట్లే.. వరుస విజయాలతో విజృంభించింది. ఇక సెమీఫైనల్‌కు చేరడం తథ్యమే అనుకుంటున్న సమయంలో 1999 జూన్ 13న ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ 7 వికెట్లకు 271 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రికీ పాంటింగ్‌తో కలిసి అప్పటి కంగారూ కెప్టెన్ స్టీవ్ వా ఇన్నింగ్స్‌ను ముందుకు నడుపుతున్న సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది.
స్టీవ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సునాయసంగా పట్టేసిన హర్షల్ గిబ్స్.. బంతిని నిర్దిష్ట సమయం చేతిలో ఆపడానికి ముందే గాల్లోకి విసిరి సంబురాలు స్టార్ట్ చేశాడు. దీన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు.. స్టీవ్ వాను నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో అజేయ శతకంతో ఆకట్టుకున్న స్టీవ్ ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అప్పటికే మూడు వికెట్లు పడి ఉన్న సమయంలో గిబ్స్ తొందరపడి ఉండకపోతే.. ఆ మ్యాచ్‌లో సఫారీ జట్టు గెలుపొందేదే అని ఎన్నో ఎళ్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్యే జరిగిన సెమీఫైనల్ ‘టై’ కాగా.. సూపర్-6 దశలో దక్షిణాప్రికాపై గెలిచిన ఆసీస్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తుదిపోరులో పాకిస్థాన్‌ను చిత్తు చేసి రెండో సారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఘటనతోనే ఐసీసీ టోర్నీల్లో దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకొని తిరిగే జట్టుగా దక్షిణాఫ్రికాపై ముద్ర పడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ఫీల్డర్‌గా గుర్తింపు ఉన్న గిబ్స్ అంత సునాయాస క్యాచ్‌ను వదిలేయడంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగుతున్న యాషెస్ సిరీస్ ఐదో టెస్టులోనూ దాదాపు ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్.. ఇంగ్లిష్ టీమ్‌కు దీటైన బదులిచ్చింది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇచ్చిన ఓ క్లిష్టమైన క్యాచ్‌ను బెన్ స్టోక్స్ పట్టినట్టే పట్టి వదిలేశాడు. దీంతో స్మిత్ బతికిపోయాడు. మోయిన్ అలీ బౌలింగ్లో స్మిత్ గ్లౌవ్స్‌కు తాకిన బంతిని లెగ్ సైడ్ పైకి లేచింది. సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అమాంతం గాల్లోకి ఎగురుతూ అతికష్టం మీద ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టాడు. దీంతో సహచరులతో పాటు డగౌట్‌లోని అభిమానులంతా సంబరాలు ప్రారంభించేస్తే.. తొందరపాటు స్టోక్స్ కాలికి చేయి తగలడంతో.. బంతి కాస్త పట్టు తప్పి నేలపాలైంది. దీంతో పలు మార్లు రిప్లేలు పరిశీలించిన అంపైర్.. నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్ చేతిలో బంతి లేకపోవడంతో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇంగ్లండ్ అప్పీల్‌ను తిరస్కరించాడు.
క్యాచ్ ఔట్ విషయంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఫీల్డర్ క్యాచ్ పట్టే సమయంలో బంతిపై పూర్తి నియంత్రణ సాధిస్తే.. క్యాచ్ పూరెనట్లే. నిర్దిష్ట సమయం అంటూ ఏదీ లేకపోయినా.. ఆటగాడికి బాల్‌పై పూర్తి పట్టు చిక్కింది అని అంపైర్ భావిస్తే.. దాన్ని ఔట్‌గా పరిగణించవచ్చు. బంతిపై పూర్తి నియంత్రణ సాధించిన వెంటనే సంబురాల్లో భాగంగా ఎందరో ఫీల్డర్లు దాన్ని గాల్లోకి విసరడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు అది ఔట్ కిందికి వస్తుంది కానీ.. ఇలా అనుకోకుండా బంతి చేతిలో నుంచి కింద పడితే అది క్యాచ్ పూర్తి కానట్లే లెక్క కావడంతో స్మిత్‌ను అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. అభిమానులు భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. అందుకే తొందర పాటు పనికిరాదనేది అని ఒకరంటే.. అప్పుడు గిబ్స్.. ఇప్పుడు స్టోక్స్ అని మరొకరు కామెంట్ చేశారు. మరి స్టోక్స్ ‘మిస్ క్యాచ్’పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. కాగా.. ఈ వీడియోపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గిబ్స్.. ‘ఎక్కడో చూసినట్లుందే’ అని కామెంట్ చేయడం కొసమెరుపు.
Out or not out? 🤷♂️ #EnglandCricket| #Ashes pic.twitter.com/q2XCJuUpxM
— England Cricket (@englandcricket) July 31, 2023