ఐసీసీ టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండగా అప్పుడే సందడి మొదలై పోయింది. అన్ని జట్లు పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తమ టీ20 జట్టుకు కొత్త హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ను నియమించాయి. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హెడన్‌ను, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్‌ను నియమించారు. హేడన్ టాలెంట్, అనుభవంపై ఎవరికీ అనుమానం లేదు. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో చెలరేగిపోయిన హేడెన్ పాకిస్తాన్ హెడ్ కోచ్ కావడం వారికి కలిసొచ్చే అంశమే. ఫిలాండర్ కూడా తక్కువేం కాదు. 64 టెస్టుల్లోనే 224 వికెట్లు తీసిన ఫిలాండర్ బౌలింగ్ కోచ్ కావడం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు శుభసూచకమే.
ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ నిర్ణయంపై నెటిజన్లు వేసే సెటైర్లు మాములుగా లేవు. వారివారి స్టైల్‌లో చేసే కామెంట్లు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ సరేగానీ పాకిస్తాన్‌కి ఇంగ్లీష్ కోచింగ్ ఎక్కడ ఇప్పిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. హేడెన్, ఫిలాండర్ ఇద్దరికీ ఉర్దూ రాదు.. పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇంగ్లీష్ రాదు.. పెద్ద చిక్కొచ్చిందే అని కొందరు అంటున్నారు. మరికొందరు ఇక నుంచి హేడన్, ఫిలాండర్ రక్షణకు బాధ్యత మాది కాదంటున్నారు. వాళ్లు కప్పు కొట్టడం సంగతి పక్కన పెడితే కోచ్ నియామకం నుంచే సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.