ఈసారి టీ20 వరల్డ్ కప్ గురించి ఎంత చెప్పుకొన్నా సరే తక్కువే. ఎందుకంటే అస్సలు ఊహించనవి చాలా జరిగాయి. ముందు ముందు జరగబోతున్నాయి కూడా. పాక్ జట్టు తొలి రెండు మ్యాచులు ఓడిపోయినప్పుడు.. ఆ జట్టు ఇంటికెళ్లిపోవడం గ్యారంటీ అని అందరూ ఫిక్సయిపోయారు. కానీ అనుహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయేసరికి.. పాక్ సెమీస్ లో అడుగుపెట్టేసింది. న్యూజిలాండ్ తో సిడ్నీ మైదానంలో బుధవారం తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ అర్హత సాధిస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాక్ కోచ్ ఇప్పుడు మిగతా జట్లకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ జట్టు కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కొన్నాళ్ల క్రితం అపాయింట్ అయ్యాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో పాక్ జట్టు ప్రదర్శన నామమాత్రంగానే సాగింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ బాబర్ ఆజామ్, మరో ఓపెనర్ రిజ్వాన్ కూడా బ్యాటింగ్ లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఇక బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే రాణించారు. ఇలా పడుతూ లేస్తూనే పాక్ జట్టు సెమీస్ లోకి ఎంటరైపోయింది. ఇలాంటి టైంలో కోచ్ హేడెన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘మా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడం గ్యారంటీ. ప్రస్తుతం మాతో ఏ జట్టు పోటీపడినా సరే ఇదే జరుగుతుంది. బాబర్ కెప్టెన్సీలోని మా జట్టు అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. మాకు ఒకే ఒక టార్గెట్ ఉంది. అది టీ20 వరల్డ్ కప్ కొట్టడమే. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో మా జట్టు దుమ్ము రేపుతోంది. ఒకవేళ ఫైనల్ కు భారత్ జట్టు లేదా ఇంగ్లాండ్ వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధమే’ అని మాథ్యూ హేడెన్, మిగతా జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఈ టోర్నీ సెమీస్ లో పాక్ జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే పాక్ ఫైనల్ కు వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో?