స్పోర్ట్స్ పార్క్ వేదికగా న్యూజిలాండ్-నెదర్లాండ్ మధ్య గురువారం జరిగిన తొలి టీ20లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న చిన్నారికి బాల్ తగిలి బలమైన గాయమైంది. నెదర్లాండ్ బౌలర్ ఫ్లాయిడ్ వేసిన ఇన్సింగ్స్ 18వ ఓవర్ మూడో బంతిని న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోధి డీప్ మిడ్ వికెట్ వైపు భారీ సిక్స్ కొట్టగా.. ఆ బంతి నేరుగా వెళ్లి మ్యాచ్ చూస్తున్న ఒక చిన్నారి తలకు బలంగా తగలింది.
దీంతో అక్కడ ఉన్న వారంతా చిన్నారికి ఏమైందో అని కంగారుగా తన దగ్గరికి పరిగెత్తుకొస్తారు. దీంతో వెంటనే న్యూజిలాండ్ టీమ్ ఫిజియో చిన్నారి వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం. కాగా న్యూజిలాండ్ ఫిజియో వెంటనే స్పందించి చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. గప్టిల్ (45), నీషమ్(32) పరుగులతో రాణించారు. ఇక లక్ష్యఛేదనలో నెదర్లాండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులు చేసి పోరాడి ఓడింది. బస్ డీ లీడి(66) పరుగులతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో చిన్నారి గాయపడిన వెంటనే కివీస్ ఫిజియో స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.