నెదర్లాండ్స్ ఓపెనర్ గా ఉంటున్న విక్రంజీత్ సింగ్ ధోనికి వీరాభిమాని. కావడం విశేషం. కానీ ఇప్పుడు ఈ ప్లేయర్ కి ఇదే సమస్యగా మారింది. ధోని అభిమానులే నన్ను తిడుతున్నారని చెప్పుకొస్తున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఫ్యాన్స్ తో పాటు మిస్టర్ కూల్ తన ఆటిట్యూడ్ తో భక్తులని కూడా సంపాదించుకున్నారు. అంతే కాదు యంగ్ క్రికెటర్స్, దిగ్గజాలు సైతం ధోనీ మీద వారి అభిమానాన్ని చాటుకుంటారు. సోషల్ మీడియాలో ఇక మహేంద్రుడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ధోనికి వీరాభిమాని అయిన్ నెదర్లాండ్స్ క్రికెటర్ విక్రమ్ జీత్ సింగ్ ధోని ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు. ధోని ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారని చెప్పుకొస్తున్నాడు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే అసలు కారణమేంటో ఇప్పుడు తెల్సుకుందాం.
ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టులో ఓపెనర్ గా ఉంటున్న విక్రంజీత్ సింగ్ ఇండియా వాడే కావడం గమనార్హం. పంజాబ్ లో పుట్టిన విక్రమ్ వ్యక్తిగత కారణాల వల్ల నెదర్లాండ్స్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. ఈ క్రమంలో అక్కడే స్థిరపడిపోయి నెదర్లాండ్స్ జట్టు ఓపెనర్ గా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవలే వరల్డ్ కప్ మ్యాచుల్లో తమ కంటే బలమైన జట్లకు షాకిస్తూ వరల్డ్ కప్ కి అర్హత సాధించింది. నెదర్లాండ్ తరపున 7 మ్యాచుల్లో 44.71 సగటుతో 313 పరుగులు చేసాడు. ఇందులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ధోని ఫ్యాన్స్ విక్రమ్ ని తిడతారు అని చెప్పడం వైరల్ అయింది. దానికి ప్రధాన కారణం ధోని జెర్సీ నెంబర్ 7 ధరించడమే కారణం. స్వతహాగా విక్రమ్ జీత్ ధోనీ ఫ్యాన్ కావడం వలన 7 వ నెంబర్ జెర్సీ ధరిస్తాడు. కానీ ధోని ఫ్యాన్స్ కి మాత్రం ఇది నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో విక్రమ్ మాట్లాడుతూ ధోని మీద తనకున్న ప్రేమను తెలియజేశాడు.
‘ధోనీ వాడుతున్న జెర్సీ నెంబర్ “7”జెర్సీ నేను ధరిస్తున్నాను. చాలామంది నా జెర్సీ నెంబర్‌పైన కామెంట్లు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలామంది మాహీ ఫ్యాన్స్.. ఆ జెర్సీ వాడొద్దని తిడుతూ కామెంట్లు పెడతారు. కానీ మరికొందరు మాహీ ఫ్యాన్స్ మాత్రం నన్ను సపోర్ట్ చేస్తూ మెసేజ్‌లు చేయడం సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి సచిన్ టెండూల్కర్ 10 నెంబర్ జెర్సీ నా ఫేవరేట్. అయితే దాన్ని టిమ్ వాన్ దేర్ వాడుతున్నాడు. అందుకే నా నెక్ట్స్ ఫేవరేట్ నెంబర్ అయినటువంటి నెంబర్ 7 సెలక్ట్ చేసుకున్నా. నా జెర్సీ నెంబర్ వెనుకున్న కథ ఇదే. ఈ జెర్సీ వేసుకున్నప్పుడల్లా ధోనీ నా వెనకే ఉండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటూ విక్రంజీత్ సింగ్ కామెంట్ చేశాడు.