పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు న్యూజిల్యాండ్ భారీ షాక్ ఇచ్చింది. రావల్‌పిండి వేదికగా వన్డే మ్యాచ్‌కు టాస్ వేసే కొద్ది నిమిషాల ముందు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మొత్తం మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం పాకిస్తాన్ వచ్చిన న్యూజిల్యాండ్ టీమ్ ఉన్నపళంగా స్వదేశానికి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. న్యూజిల్యాండ్ భద్రతా సలహాదారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ టూర్‌కి వచ్చిన న్యూజిల్యాండ్ ఇలా తిరుగు ముఖం పట్టడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది.
‘ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను కొనసాగించలేము. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద షాకింగ్ వార్తే అవుతుంది. ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. మాకు ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు’ అంటూ న్యూజిల్యాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు. ఆటగాళ్ల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. న్యూజిల్యాండ్ నిర్ణయంపై పీసీబీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సిరీస్‌ను యథావిధిగా కొనసాగించేందుకు తాము సిద్ధమని ఓ ప్రకటనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. పీసీబీ ఏర్పాట్ల పట్ల న్యూజిల్యాండ్ ఆటగాళ్లు సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. సిరీస్‌ను ఇలా అర్థాంతరంగా నిలిపివేస్తే పీసీబీపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం వారి అసహనాన్ని వ్యక్తం చేశారు. షోయబ్ అక్తర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరిచాడు. న్యూజిల్యాండ్‌లో చర్చి దాడిలో తొమ్మిది మంది పాకిస్తానీలు మరణించినా.. మేము మంచి సంబధాలను కొనసాగించాము. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్.. న్యూజిల్యాండ్‌లో పర్యటించింది. అది ఓ నిరాధారమైన హెచ్చరిక.. మాట్లాడుకుంటే సరిపోయేది కదా. న్యూజిల్యాండ్.. పాకిస్తాన్ క్రికెట్‌ని చంపేసిందంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు.
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నెట్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో కశ్మీర్ జట్టును చేర్చడం సంగతి పక్కన పెట్టి ముందు ఆటగాళ్లకు భద్రత కల్పించండి. మ్యాచ్‌లను సరిగ్గా నిర్వహించడంపై మీ దృష్టి సారించండి అంటూ హితవు పలుకుతున్నారు. న్యూజిల్యాండ్ నిర్ణంయపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
The BLACKCAPS are abandoning their tour of Pakistan following a New Zealand government security alert.
Arrangements are now being made for the team’s departure.
More information | https://t.co/Lkgg6mAsfu
— BLACKCAPS (@BLACKCAPS) September 17, 2021