క్రీడాలోకంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది? అంటే చాలా మంది తడుముకోకుండా చెప్పే మాట ఫుట్ బాల్. మరి అలాంటి ఆటలో దేశానికి వరల్డ్ కప్ అందించాలని ఏ ఆటగాడికి ఉండదు చెప్పండి. కానీ ఒక్క ఆటగాడు మాత్రం 36 ఏళ్లుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని ఒంటిచేత్తో తీర్చాడు ఆ యోధుడు.. అతడే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. అర్జెంటీనా అంటే మెస్సీ.. మెస్సీ అంటే అర్జెంటీనా.. అనే అంతగా అతడు అభిమానుల హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు. ఇక తన చివరి ప్రపంచ కప్ ను దేశానికి అందించి వీడ్కోలు పలకాలి అన్ని అతడి కల నెరవేరింది. తాజాగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో షూటౌట్ లో ఫ్రాన్స్ ను 4-2 తో ఓడించి జగజ్జేతగా నిలిచింది అర్జెంటీనా.
మెస్సీ.. మెస్సీ.. వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న మైదానంలో హోరెత్తుతున్న నామ స్మరణం. ఇక ఎప్పుడెప్పుడా అని ప్రపంచం మెుత్తం ఎదురుచూస్తున్న మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అర్జెంటీనా అన్ని విభాగాల్లో అద్భుత ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యర్థి డిఫెన్స్ ను ఒత్తిడికి గురిచేసింది. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై అర్జెంటీనా ఎటాక్ లు చేస్తూనే ఉంది. కానీ ఫ్రాన్స్ ఆట ఇందుకు విరుద్దంగా సాగింది. ఆ జట్టులో జోష్ కనిపించలేదు. అదీకాక ప్రథమార్థంలో ఒక్కటంటే ఒక్కటి ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై ఎటాక్ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే అర్జెంటీనాకు పెనాల్టీ రావడంతో 23వ నిమిషంలో మెస్సీ.. ఫ్రాన్స్ గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ అద్భుతమైన గోల్ లో అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.
ఇదే దూకుడును కొనసాగించిన అర్జెంటీనా వెంటనే 36వ నిమిషంలో గోల్ కొట్టింది. మెస్సి ఇచ్చిన చక్కని ప్లిక్ ను అందుకున్న అల్వారెజ దాన్ని అలిస్టర్ కు పంపాడు. అతడి నుంచి బంతిని అందుకున్న డిమారియా అద్భతమైన గోల్ కొట్టి అర్జెంటీనాను 2-0తో తిరుగులేని స్థాయిలో నిలిపాడు. దాంతో ప్రధమార్థంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది మెస్సీ జట్టు. ఇక ఫ్రాన్స్ పని అయిపోయింది అనుకున్న తరునంలో ఫ్రాన్స్ తురుపు ముక్క ఎంబాపె కేవలం 97 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి స్కోర్ ను 2-2తో సమం చేశాడు. 80వ నిమిషంలో లభించిన పెనాల్టీని ఎంబాపె సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మరో గోల్ కొట్టాడు. స్కోర్లు సమం కావడంతో ఆట అదనపు సమయానికి వెళ్లింది.
ఈ టైమ్ లో 108వ నిమిషంలో మెస్సీ మాయ చేశాడు. అద్భుతమైన గోల్ తో జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ ఫ్రాన్స్ తురుపు ముక్క అయిన ఎంబాపె అర్జెంటీనాకు పక్కలో బల్లెంలా మారాడు. తనకు వచ్చిన మరో పెనాల్టీని మళ్లీ సద్వినియోగం చేసుకుని గోల్ సాధించాడు దాంతో స్కోర్లు 3-3 తో సమం అయ్యాయి. అసలైన ఫైనల్ అంటే ఇదే అన్నట్లుగా ఆట షూటౌట్ కు దారితీసింది. ఇక షూటౌట్ లో మెుదటి పెనాల్టీని స్టార్ ప్లేయర్ ఎంబాపె సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత మెస్సీ గోల్ కొట్టాడు. అయితే ఫ్రాన్స్ రెండు, మూడవ పెనాల్టీలను విఫలం చేసుకుంది.
A piece of history 🥅 ✂️ #FIFAWorldCup #Qatar2022 pic.twitter.com/R0QsY38xGP
— FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022
ఇక అర్జెంటీనా మాత్రం తనకు లభించిన పెనాల్టీలను విజయవంతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ సాధించింది. దాంతో స్కోర్ 3-1 తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఫ్రాన్స్ ఆటగాడు నాలుగో పెనాల్టీని సద్వినియోగం చేసుకున్నాడు, దాంతో స్కోర్ 2-3తో ఫ్రాన్స్ ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే అర్జెంటీనా ఆటగాడు మాంటియల్.. ఫ్రాన్స్ గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ గోల్ చేయడంతో ఫిపా వరల్డ్ కప్ 2022 అర్జెంటీనా సొంతం అయ్యింది. దాంతో 36 ఏళ్ల అర్జెంటీనా నిరీక్షణకు తెర దించాడు లియెునల్ మెస్సీ. ఫిఫా వరల్డ్ కప్ ను అందుకుని పీలే, మారడోనాల సరసన సగర్వంగా నిలబడ్డాడు ఓ పోరాట యోధుడు.. అతడే లియెునల్ మెస్సీ.
Messi ❤️ Mbappe#FIFAWorldCup #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022