సానియా మీర్జా– షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారా? వాళ్లిద్దరు విడిగా ఉంటున్నారు.. త్వరలోనే విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు.. అంటూ చాలానే కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ మీడియా కూడా వారు విడిపోనున్నారంటూ కథనాలు ప్రచురిస్తున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ కూడా ఓ స్టోరీలో పేర్కొంది. వాళ్లిద్దరూ చాలాకాలంగా విడిగానే ఉంటున్నారని.. కేవలం కొడుకు కోసం మాత్రం అప్పుడప్పుడూ కలుస్తున్నారంటూ చెబుతున్నారు. వాళ్లిద్దర మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయంటూ అటు సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఇప్పటివరకు ఇరువురూ స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు.
అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణిగా పలు ఘనతలు అందుకున్న సానియా మీర్జా.. 2010 ఏప్రిల్‌లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీళ్ల పెళ్లి రెండు దేశాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. వారికి ఇజహాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. భారత్- పాక్ మధ్య మ్యాచ్ ఉన్న ప్రతిసారి సానియాపై ట్రోలింగ్ జరిగేది. కానీ, ఎప్పుడూ ఆమె వాటిని పట్టించుకునేది కాదు. వారి మధ్య బంధం ఎంత గట్టిదో తెలుపుతూ ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ ఉండేది. ఇటీవలి కాలంలో సానియా మీర్జా చేసిన సోషల్ మీడియా పోస్టులు.. వారి మధ్య బంధం చెడిందనే పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. ఆమె ఈ మధ్య కొన్ని క్రిప్టిక్ మెసేజ్‌లను పోస్టు చేస్తూ వచ్చింది. అలాగే ఆమె కుమారుడి పుట్టినరోజు కూడా ఆ విషయం బాగా వ్యాప్తి చెందింది.
సానియా మీర్జా- షోయబ్ మాలిక్ అక్టోబర్ 30న దుబాయ్‌లో కుమారుడు ఇజహాన్ పుట్టనరోజుని ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. షోయబ్ మాలిక్ తన సోషల్ మీడియాలో కొడుకు- భార్యతో కలిసున్న ఫొటోలను పంచుకున్నాడు. అయితే సానియా మాత్రం కేవలం ఇజహాన్‌తో కలిసున్న ఫొటోలను మాత్రమే షేర్ చేసింది. అప్పుడు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. “నీ జీవితంలో నీకున్న నిజమైన ప్రేమ.. నిన్ను ఇజహాన్ చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది” అంటూ కామెంట్ చేసింది. నాలుగురోజుల క్రితం.. కుమారుడు తనకు ముద్దుపెడుతున్న ఒక పిక్‌ని అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోకి నన్ను కష్టమైన రోజుల నుంచి బయటపడేసే సందర్భాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీటిని ఆధారంగా చూపిస్తూ ఎంతో మంది వారి మధ్య బంధం ముక్కలవబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే ఇప్పుడు ఇంకో విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్‌కి ఓ మోడల్‌తో పరిచయం ఏర్పడింది అని. ఆ పరిచయమే ఇప్పుడు వారి మధ్య బంధాన్ని చెడగొట్టిందని చెబుతున్నారు. మాలిక్ ఆ మోడల్‌తో చనువుగా ఉన్నాడని.. అది తెలుసుకునే సానియా దూరంగా ఉంటోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సానియా అలా దూరంగా ఉంటున్నా కూడా.. షోయబ్ మాలిక్ పరిస్థితిని చక్కదిద్దేంకు ప్రయత్నాలు కూడా ఏమీ చేయలేదంటున్నారు. అందుకే సానియా ఇంక తమ బంధాన్ని ముగించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం సినారియోలో ఏదీ అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. సానియా మీర్జా గానీ, షోయబ్ మాలిక్ గానీ వారి బంధం గురించి ప్రస్తావించలేదు. అసలు ఈ ప్రచారాల్లో ఎంతవరకు నిజం ఉంది అని కూడా చెప్పే పరిస్థితి లేదు. కానీ, వాళ్లు ఈ పుకార్లపై స్పందించకపోవడమే అవి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఆస్కారాన్ని ఇస్తున్నాయి.