క్రీడాకారులపై ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు కాల్పులు జరిపిన ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ లో అలాంటి ఘటనలు కాస్త ఎక్కువనే చెప్పాలి. అందుకే ఆ దేశ పర్యటనకు ఏ ఒక్క దేశం కూడా ముందుకు రాదు. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం పాకిస్థాన్ లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడిని క్రికెట్ ప్రపంచం మరిచిపోలేదు. అందుకే అప్పటి నుంచి పాకిస్థాన్ లో పర్యటించేందుకు ఏ దేశం సుముఖత చూపించడంలేదు. అయితే ఇంగ్లాండ్ ధైర్యం చేసి పాకిస్థాన్ లో అడుగు పెట్టింది. అలానే పాక్ ప్రభుత్వం కూడా తమ భద్రత ప్రమాణాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ధృడ నిశ్చయంతో ఉంది. అందుకే ఇటీవల పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లీష్ జట్టుకు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇంగ్లాండ్ జట్టు ఉన్న హోటల్ సమీపంలో కాల్పుల మోత మోగింది. దీంతో ఆ జట్టుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
చాలా కాలం తరువాత పాకిస్థాన్ పర్యటకను వెళ్లిన ఇంగ్లిష్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వారితో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాడ్ జట్టు విజయం సొంతం చేసుకుంది. మొదటి టెస్టుతో ఉత్సాహం మీద ఉన్న ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టు కోసం సన్నద్ధం అవుతుంది. ఇలాంటి సమయంలో ఆ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముల్తాన్ లో ఆ జట్టు ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం క్రికెటర్లు ఉన్న హోటల్ కు కిలోమీటర్ దూరంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన చిన్న గొడవ..పెద్దదిగా మారి కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు. వారు బస చేస్తోన్న హోటలకు భద్రతను మరింత పెంచారు. అంతేకాక ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియంకు వెళ్లేదారిలో ఇతర వాహనాలను అనుమతించలేదు. మరోవైపు ఈ ఘటన గురించి ఇంగ్లాండ్ జట్టును పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టు కోసం ఆటగాళ్లు యథావిధిగా ప్రాక్టీస్ చేశారు. ఇటీవలే పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ పై దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకు ముందే తాజా ఘటనతో ఆందోళన రెట్టింపైంది.