న్యూజిలాండ్ తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు శుభ్ మన్ గిల్. దాంతో అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి వరకు ఉన్నాడు గిల్. గిల్ ఇన్నింగ్స్ చూసిన మాజీలు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఆటగాడే వరల్డ్ క్రికెట్ కు అవసరం అని గిల్ పై పొగడ్తలు కురిపించాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. ఇలాగే నిలకడతో ఆడితే గిల్ క్రికెట్ దిగ్గజం కావడం ఖాయం అని పేర్కొన్నాడు. తాజాగా గిల్ ద్విశతకంపై తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు సల్మాన్ భట్.
శుభ్ మన్ గిల్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచలో మారుమ్రోగుతున్న పేరు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలి వన్డేలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో వరల్డ్ వైడ్ గా గిల్ పై ప్రశంలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే శుభ్ మన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ..”గతంలో నేను చాలా సార్లు గిల్ ఆటను చూశాను. కానీ గతేడాది టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో గిల్ ఆట చూసి.. అతడికి అభిమానిగా మారిపోయా. నిజంగా గిల్ బ్యాటింగ్ స్టైల్, అతడు ఆడే విధానం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అయితే గిల్ ఎందుకు భారీ స్కోర్లు సాధించలేకపోతున్నాడు అనే బాధ నాకుండేది. ఆ బాధ ఈ ఇన్నింగ్స్ చూశాక పోయింది” అని సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే క్రికెట్ లో చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే ఇలా క్రీజ్ లో చివరిదాక నిలదొక్కుకోగలరని, అందులో గిల్ ఒకడని సల్మాన్ పేర్కొన్నాడు. ఇక కివీస్ తో మ్యాచ్ లో తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్.. చివర్లో తన విశ్వరూపాన్నే చూపాడు. దూకుడుతో పాటుగా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయగలను అని నిరూపించాడు గిల్. గతంలో సచిన్, మార్క్ వా, కల్లీస్, సయీద్ అన్వర్ లు మాత్రమే ఇలా ఆడేవారు అని గుర్తు చేశాడు సల్మాన్ భట్. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి బ్యాటింగ్ ను చూశానని భట్ చెప్పుకొచ్చాడు. మరి సల్మాన్ భట్, శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.