టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. మహేంద్ర సింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్నాడు. ధోనీపై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్ బౌన్స్ కేసులో ధోని పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. టీమిండియాకు కెప్టెన్ గా పని చేసిన సమయంలో బీహార్ కు చెందిన ఒక ఎరువుల తయారీ సంస్థకు ప్రమోటర్ గా ఉన్న ధోని.. ఈ కేసులో అనవసరంగా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంఎస్ ధోని.. టీమిండియా కెప్టెన్‌గా పనిచేస్తున్న సమయంలో బీహార్ కు చెందిన ఫర్టిలైజర్స్ సంస్థ ‘న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్’ కు ప్రమోటర్ గా ఉన్నాడు. ఆ సమయంలో ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ.. న్యూఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే ఎరువులు కొనుగోలు చేసింది. వాటిని అప్పట్లోనే న్యూఇండియా గ్లోబల్ సంస్థ డెలివరీ కూడా చేసింది. అయితే ఈ ఎరువులలో నాణ్యత లోపం ఉందని.. వాటిలో చాలా వరకు అమ్ముడుపోలేదని ఎస్కే ఎంటర్ ప్రైజెస్ ఆరోపించింది. ఆ తర్వాత సదరు న్యూఇండియా సంస్థ.. ఆ ఎరువులను వాపసు తీసుకుని, రూ.30 లక్షల చెక్కును ఏజెన్సీకి అందజేసింది. ఆ చెక్కును ఎస్కే ఎంటర్ ప్రైజెస్ కంపెనీ.. బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది.
దీంతో సదరు సంస్థ న్యూఇండియా గ్లోబల్ సంస్థ కు ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు న్యూఇండియా కంపెనీ సీఈవో రాజేష్ ఆర్య, కంపెనీకి చెందిన మరో ఏడుగురు సిబ్బందికి లీగల్ నోటీసులు పంపింది. తాజాగా వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ కేసును విచారించిన బెగుసరాయ్ కంజ్యూమర్స్ కోర్టు.. దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు సిపార్సు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 28న జరుగనుంది.
ఇది కూడా చదవండి: Dhoni: తన వీరాభిమానిని కలిసి.. చిరకాల కల నెరవేర్చిన ఎంఎస్ ధోనీ!