ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కెప్టెన్లు ఉన్నప్పటికీ.. టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనినే బెస్ట్ కెప్టెన్ అని ప్రశంసించాడు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్, మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్. ఆసిస్ దిగ్గజం రికీ పాంటిగ్ కంటే కూడా కెప్టెన్సీలో ధోనినే బెస్ట్ అంటూ కితాబిచ్చాడు. తాను ఎందుకు బెస్ట్ కెప్టెన్ అంటున్నాడో కూడా సమాధానాలు చెప్పుకొచ్చాడు. టీమిండియా క్రికెట్ లో రాజకీయాలు ఎక్కువని, ఇలాంటి దేశంలో కెప్టెన్ గా కొనసాగడం అంటే సాహసం అనే చెప్పాలని బ్రాడ్ హగ్ పేర్కొన్నాడు. ఇలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందివ్వడం ఎంతో గొప్ప విషయం అంటూ కితాబిచ్చాడు.
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు. భారత జట్టుకు సారథిగా పగ్గాలు చేపట్టాక.. ఎన్నో మరపురాని, మర్చిపోలేని చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. టీమిండియాకు వరల్డ్ కప్ తో పాటు మరో రెండు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనత మహేంద్రుడి సొంతం. ఇంతటి ఘనత వహించిన ధోనినే బెస్ట్ కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ బ్రాడ్ హగ్. తన సొంత యూట్యూబ్ ఛానల్లో.. రికీ పాంటింగ్, ధోనీలో ఎవరు బెస్ట్ కెప్టెన్? అన్న పాయింట్ పై విశ్లేషణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హగ్. వీటితో పాటుగా టీమిండియా క్రికెట్ పై ఓ విధంగా విమర్శలు కూడా చేశాడనే చెప్పుకోవచ్చు. భారత క్రికెట్ లో రాజకీయ జోక్యం ఎక్కువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ సందర్భంగా బ్రాడ్ హగ్ మాట్లాడుతూ..”రికీ పాంటింగ్ కెప్టెన్సీ సమయంలో అతడికి అద్భుతమైన టీమ్ దొరికింది. హెడెన్, గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ, మెగ్రాత్, సైమాండ్స్ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అలాగే ధోనికి సైతం సచిన్, సెహ్వాగ్, యువీ, గంభీర్, రోహిత్, కోహ్లీ లాంటి మేటి ప్లేయర్లు ఉన్నారు. ఇక సీనియర్లతో పాటుగా జూనియర్లను ఎలా వాడుకోవాలో ధోనికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదని నా అభిప్రాయం. ఇదే ధోని విజయ రహస్యం. అయితే పాంటింగ్ గొప్ప కెప్టెన్ అయినప్పటికీ భారత క్రికెట్ లో ఉండే రాజకీయాలు వేరు. ఆ రాజకీయాలను తట్టుకుని అద్భుతమై సారథ్యం వహించాడు ధోని అందుకే ధోని బెస్ట్ కెప్టెన్” అంటూ బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా లాంటి జట్టును నడిపించాలి అంటే ఎన్నో ఆటంకాలను, ఒత్తిడిలను ఎదుర్కొవాల్సి వస్తుందని బ్రాడ్ హగ్ తెలపాడు. వీటన్నింటినీ తట్టుకుని ధోని భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందివ్వడం అనేది మామూలు విషయం కాదని హగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇంతలా రాజకీయాలు ఉండవని, ఉన్నా అవి కెప్టెన్ దాక రావని చెప్పుకొచ్చాడు. ఏ ప్లేయర్ ను ఎలా ఉపయోగించాలో ఇద్దరికి బాగా తెలుసని.. కానీ అన్ని విధాలా రికీ పాంటింగ్ కంటే ధోనినే బెస్ట్ కెప్టెన్ అని బ్రాడ్ హగ్ స్పష్టం చేశాడు.